తన ఆస్తులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుపై బదిలీ చేసిన డాక్యుమెంట్స్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అందజేస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న
46 జీఓపై కమిటీ వేసి రద్దు చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ నాలుగు ముక్కలవుతుందని.. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకోవడంతో కూతురు జైలుకెళ్లిందని, వారు కూడా జైలుకు వెళ్లకతప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్ వేసిన సందర్భంగా శుక్రవారం నల్లగొండలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు.
తీన్మార్ మల్లన్న కేసీఆర్ దోపిడీపై పోరాటం చేశాడని, ఆయన్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జీఓ 46తో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత దానిపై అసెంబ్లీ సమావేశాల్లో కమిటీ వేసి రద్దు చేస్తామని చెప్పారు.
ప్రభుత్వానికి ఆస్తులు అప్పగించిన తీన్మార్ మల్లన్న
నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) తన కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తన కుటుంబం పేర ఇప్పటివరకు రూ.కోటీ 50 లక్షల ఆస్తులు ఉన్నాయని చెప్పారు.
తన భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నదని, ఆమె ఒప్పుకున్నాకే ఆమె పేరు మీద ఉన్న కోటిన్నర ఆస్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరున రాసి ఇస్తున్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్న ఉద్దేశంతో ఆస్తులను అప్పగించినట్టు చెప్పారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే.. రాజకీయాల్లో సంచలన మార్పులు తీసుకొస్తానని ఆయన చెప్పారు. అంతకుముందు ఆయన నల్లగొండ పట్టణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.
తీన్మార్ మల్లన్నపై 56 కేసులు
రాష్ట్రంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో తనపై 56 కేసులు ఉన్నాయని తన ఎన్నికల అఫిడవిట్‌లో తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. తన పేరుతో రూ.16.34 లక్షల విలువైన బంగారం, ఆస్తులు, నగదు ఉండగా, తన భార్య పేరుతో రూ.17.66 లక్షల విలువైన బంగారం, ఆస్తులు, నగదు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం రూ.3 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ.50 లక్షల విలువలైన వ్యవసాయేతర భూమి, రూ.50 లక్షల విలువైన నివాస గృహం ఉన్నట్లు తెలిపారు. రూ.31.29 లక్షల అప్పులు ఉన్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment