నల్లగొండకు రాములు.. రంగారెడ్డికి చిన్నారెడ్డి? | Sakshi
Sakshi News home page

నల్లగొండకు రాములు.. రంగారెడ్డికి చిన్నారెడ్డి?

Published Thu, Jan 14 2021 8:54 AM

Congress Has Almost Finalized Candidates For Graduate MLC Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ దాదాపు ఖరారు చేసింది. నల్లగొండ– ఖమ్మం– వరంగల్‌ జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ ఎస్‌.రాములు నాయక్, రంగారెడ్డి– హైదరాబాద్‌– మహబూబ్‌నగర్‌ జిల్లాల నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి జి.చిన్నారెడ్డిలను నిర్ణయించినట్టు సమాచారం. నల్లగొండ స్థానానికి ఓయూ విద్యార్థి నాయకుడు కోటూరి మానవతారాయ్, రంగారెడ్డి స్థానానికి మాజీ ఎమ్మెల్యే, యువ నాయకుడు చల్లా వంశీచంద్‌ రెడ్డి పేర్లు కూడా అధిష్టానం తుది పరిశీలనలో ఉన్నప్పటికీ.. వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్‌ అధిష్టానం రాములు నాయక్, చిన్నారెడ్డిల అభ్యర్థిత్వాలకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుని అభ్యర్థిత్వాలను అధికారికంగా ప్రకటిస్తుందనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్‌ కీలక నిర్ణయం!

కసరత్తు.... ఓ కొలిక్కి
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ పెద్ద కసరత్తే చేసింది. ముందుగా రెండు నెలల క్రితమే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. నల్లగొండ స్థానానికి 26, రంగారెడ్డికి 24 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల వడపోత సాగుతుండగానే టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, ఇంటి పార్టీ నేత చెరకు సుధాకర్‌లు నల్లగొండ స్థానంలో తమకు మద్దతివ్వాలని టీపీసీసీ నాయకత్వాన్ని విడివిడిగా కోరారు. దీంతో పొత్తులపై నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ జరిపిన అభిప్రాయ సేకరణలో మెజారిటీ నేతలు కాంగ్రెస్‌ పార్టీ బరిలో ఉండాలని కోరారు. మాణిక్యం ఠాగూర్‌తో భేటీలో ముఖ్యనాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చిన నేపథ్యంలో రెండుస్థానాల్లోనూ పోటీ చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించింది. దీంతో దరఖాస్తుల వడపోత కార్యక్రమాన్ని పూర్తి చేసి అభ్యర్థిత్వాలను ఓ కొలిక్కి తెచ్చిన టీపీసీసీ ఒక్కో స్థానానికి మూడు పేర్లను అధిష్టానానికి పంపింది. ఇక, ఏఐసీసీ ఆ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసి అధికారికంగా అభ్యర్థులను ప్రకటించడమే మిగిలింది.

సామాజిక సమీకరణాలు... అనుభవం
ఈ రెండు ఎమ్మెల్సీ టికెట్లను కేటాయించేందుకు సామాజిక సమీకరణాలు, అనుభవం అనే ప్రాతిపదికలను కాంగ్రెస్‌ పార్టీ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. నల్లగొండ– ఖమ్మం–వరంగల్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా రాములునాయక్‌ను కూడా ఇదే కోణంలో ఎంపిక చేసినట్టు గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు ఎమ్మెల్సీగా రెండేళ్ల పదవీకాలం ఉండగానే అధికార టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చారు. గిరిజన నేతగా, తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తింపు ఉన్నప్పటికీ అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆయనకు పార్టీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది. దీనికి తోడు ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఎస్టీ, అందులోనూ లంబాడీ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ఉన్నారు. త్వరలో ఉపఎన్నిక జరగనున్న నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ సామాజికవర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి.

వీటన్నింటి దృష్ట్యా రాములునాయక్‌ అభ్యర్థిత్వం వైపు కాంగ్రెస్‌ పార్టీ మొగ్గు చూపినట్టు సమాచారం. ఇక, ఈ స్థానం నుంచి పరిశీలించిన ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ దాసోజు శ్రావణ్‌ యువకుడు కావడం, ఆయన ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న కారణంగా తరువాత అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే టికెట్‌ను ఆశించిన విద్యార్థి నాయకుడు మానవతారాయ్‌ సేవలను పార్టీకి వినియోగించుకోవాలని, వచ్చే ఎన్నికల్లో ఆయనను పోటీ చేయించాలనేది అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. రంగారెడ్డి– హైదరాబాద్‌– మహబూబ్‌నగర్‌ అభ్యర్థిగా జి.చిన్నారెడ్డిని అనుభవం ప్రాతిపదికన ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈసారి చిన్నారెడ్డికి అవకాశం ఇవ్వాలని టీపీసీసీ పెద్దలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, టి.రామ్మోహన్‌ రెడ్డిలు పోటీ నుంచి తప్పుకోవడం, అధిష్టానం పరిశీలనలో ఉన్న వంశీ యువకుడు కావడంతో మరోమారు అవకాశం ఇవ్వవచ్చనే ఆలోచన మేరకు ఇక్కడి నుంచి చిన్నారెడ్డి పేరు దాదా పు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement