పార్లమెంట్‌లో ప్రజావాణి వినిపిస్తా | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో ప్రజావాణి వినిపిస్తా

Published Wed, Apr 17 2024 1:30 AM

- - Sakshi

వనపర్తిటౌన్‌/ఖిల్లాఘనపురం/నాగర్‌కర్నూల్‌/ నాగర్‌కర్నూల్‌ రూరల్‌: తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే.. ఢిల్లీలో ఈప్రాంత ప్రజల వాణి వినిపిస్తానని నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌ జెడ్పీ మైదానంలో మార్నింగ్‌ వాక్‌ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్‌, అంబేడ్కర్‌ చౌరస్తాలలో హమాలీ సంఘం నాయకులను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం రాజకీయ ఐక్యవేదిక సదస్సులో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని దళితవాడ, రాజీవ్‌చౌక్‌, కాశీంనగర్‌లో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి కార్నర్‌ మీటింగ్‌, ఖిల్లాఘనపురంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయా సమావేశాల్లో ఆర్‌ఎస్‌పీ మాట్లాడుతూ మహనీయుల ఆశయసాధన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన ఏడేళ్ల సర్వీస్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రభుత్వంతో కొట్లాడి ఎర్ర బస్సు నుంచి ఎయిర్‌ బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పారు. విద్యార్థుల కోసం కొత్త పథకాలు తీసుకురావడమే కాకుండా, వారిలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తానన్నారు. గతంలో ఇక్కడ ఎంపీలుగా గెలిచిన నాయకులు ఎలాంటి సేవలు అందించారో ప్రజలందరికీ తెలుసన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు జరిగిన 223 రోజుల్లో కేవలం 6 నిమిషాలు మాత్రమే మాట్లాడిన ఎంపీ కొడుకు బీజేపీ అభ్యర్థి అని ఎద్దేవా చేశారు. గతంలో రెండు సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి ఈప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. నాగర్‌కర్నూల్‌ ఎంపీగా తనను గెలిపిస్తే, ఈ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో నిలుపుతానని హామీ ఇచ్చారు.

● కొనుగోలు కేంద్రాలకు కనీసం గన్నీబ్యాగులు అందించలేని పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. మాయమాటలు చెప్పి, ఓట్లు దండుకోవడం కాంగ్రెస్‌కు వెన్నెతో పెట్టిన విద్య అని అన్నారు. కేసీఆర్‌ హయాంలో ఖిల్లాఘనపురం మండలానికి సాగునీరందించే పనులను ఒక్క ఏడాదిలోనే పూర్తిచేసినట్లు వివరించారు. విద్యావేత్త ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను ఎంపీగా గెలిపించుకోవడం బాధ్యతగా భావించాలని కోరారు. సమావేశాల్లో అభిలాష్‌రావు, ప్రత్యూష, ఎంపీపీ కృష్ణానాయక్‌, జెడ్పీటీసీ సామ్యానాయక్‌, గ్రంథాలయ చైర్మన్‌ లక్ష్మయ్య, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి, లక్ష్మారెడ్డి, కృష్ణయ్య, మంగి విజయ్‌, ప్రదీప్‌, ఐతోల్‌ లక్ష్మయ్య, భాస్కర్‌గౌడ్‌, గంగాధర్‌, కరణ్‌ లాల్‌, రాంనర్సయ్య, గంగ, మీసాల రాము పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

Advertisement
Advertisement