ఖాన్‌దాదాతో గేమ్స్‌ | Sakshi
Sakshi News home page

ఖాన్‌దాదాతో గేమ్స్‌

Published Sat, Apr 20 2024 2:00 AM

- - Sakshi

కడపలో సామాజిక కుట్రలకు తెర లేపుతున్న టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి

ఇటీవల వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన అఫ్జల్‌ఖాన్‌కు ఎర

కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయించాలని ప్లాన్‌

రూ.5కోట్లు ఫండ్‌ ఇస్తామని ప్రలోభాలు

ముస్లీం మైనార్టీల ఓట్లు చీల్చడమేలక్ష్యంగా ఎత్తుగడలు

సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీకి ప్రజాదరణ కరువవుతోంది. కుట్రలు, కుయుక్తులతో మద్దతు పెంచుకోవాలనే దిశగా నాయకులు ఎత్తుగడలు వేస్తున్నారు. సామాజిక సమీకరణలకు తెరలేపుతూ తద్వారా లబ్ధి పొందాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలో ముస్లిం మైనార్టీ ఓటర్ల మధ్య గణనీయంగా చీలికలు తీసుకు రావాలనే ఎత్తుగడలకు తెరలేపారు. ఆమేరకు వైఎస్సార్‌సీపీకి ఇటీవల రాజీనామా చేసిన ఓ నాయకున్ని ఎంచుకున్నారు. రూ.5కోట్లు ఫండ్‌ ఇస్తాను, కాంగ్రెస్‌ అధ్యక్షరాలితో తానే మాట్లాడి టికెట్‌ ఇప్పిస్తాను. వారు కూడా మరో రూ.5కోట్లు ఫండ్‌ ఇస్తారు. పోటీచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. కడప అసెంబ్లీ పరిధిలో త్రిముఖ పోటీ పెట్టించి లబ్ధి పొందాలనే ఆలోచనను అమల్లోకి తెస్తున్నారు.

● వైఎస్సార్‌సీపీకి చెందిన మైనార్టీ నాయకుడు అఫ్జల్‌ఖాన్‌ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీలో అనుకున్నస్థాయిలో ప్రాధాన్యత దక్కలేదనే భావనను వ్యక్త పర్చారు. అదే అదునుగా భావించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి నేరుగా అఫ్జల్‌ఖాన్‌తో టచ్‌లోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ అఽభ్యర్థిగా పోటీ చేయాలని ఆ పార్టీ టికెట్‌ ఇప్పించే బాధ్యత తనదేనని చెప్పుకొచ్చినట్లు సమాచారం. వ్యక్తిగతంగా తాను రూ.5కోట్లు ఫండ్‌ ఇస్తానని, మరో రూ.5కోట్లు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇస్తుందని, ఆమేరకు రాష్ట్ర అధ్యక్షరాలు షర్మిలతో కూడా హామీ ఇప్పిస్తానని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. కడప అసెంబ్లీకి త్రిముఖ పోటీ ఉండాలని, అందుకు మీరే సరైన నాయకుడంటూ అఫ్జల్‌ఖాన్‌తో మంతనాలు నిర్వహించినట్లు సమాచారం. తద్వారా మీకు ప్రత్యేక గుర్తింపు దక్కుతుందని కూడా వివరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత టీడీపీలో కూడా తగిన ప్రాధాన్యత ఇప్పించే బాధ్యత కూడా తనదేనని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా, మైనార్టీ నేత అఫ్జల్‌ఖాన్‌ వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేయకముందు ఆయన సోదరుడు అఫ్సర్‌ఖాన్‌ తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో కడప వాసులు ఒకింత ఆశ్చర్యానికి గురైనా తాజా పరిణామాల నేపథ్యంలో వ్యూహాత్మక ఎత్తుగడలకు ఆనాడే బీజం పడినట్లుగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మొన్న జయాగార్డెన్‌లో వాసు, అఫ్జల్‌ఖాన్‌, సునీతారెడ్డి సమావేశమైనట్లు సమాచారం.

కుటుంబంలో ఏకాకిగా మిగలడంతో....

రెడ్డెప్పగారి కుటుంబంలో శ్రీనివాసులరెడ్డి ఏకాకి అయ్యారు. ఆయన వ్యవహార శైలి నచ్చకపోవడం, చంద్రబాబునాయుడు కుటుంబాలను విభజించి పాలించు అనే సూత్రాన్ని అమలు చేయడం ఇలాంటి కారణాలతో సోదరుడు మాజీ ఎమ్మెల్యే ఆర్‌ రమేష్‌కుమార్‌రెడ్డి టీడీపీ వీడారు. అలాగే మేనమామ కుమారుడు మాజీ శాసనమండలి సభ్యుడు ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి సైతం తెలుగుదేశం పార్టీ వదిలేశారు. సుదీర్ఘకాలం చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ ఉన్నతికి పనిచేసిన వారిని జిల్లా అధ్యక్షుడిగా పొలిట్‌బ్యూరో సభ్యుడుగా శ్రీనివాసులరెడ్డి నిలుపుకోలేకపోయారు. ఈపరిస్థితుల్లో కడపలో పట్టు సాధించుకోవాలనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్లు సమాచారం. తద్వారా అటు పార్టీలో ఇటు కుటుంబంలో పట్టు నిలుపుకోవచ్చనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఎలాగైనా మైనార్టీ ఓటర్లుల్లో చీలిక తీసుకొచ్చి, రెడ్డి సామాజిక వర్గానికి దగ్గరగా ఉంటూ లబ్ధిపొందాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు ప్రతి చిన్న అంశాన్ని సైతం రెచ్చగొట్టి రాజకీయం చేస్తూ లబ్ధి పొందే ఎత్తుగడలను పాటిస్తున్నారు. ఆమేరకు చలమారెడ్డిపల్లె, మాసాపేట సర్కిల్‌లో చోటు చేసుకున్న ఉదంతాలనను పరిశీలకులు ఉదహరిస్తున్నారు.

Advertisement
Advertisement