స్టార్స్‌కు తగ్గట్టుగా కథలను రాసుకునే దర్శకులు కొందరైతే, కథలకు తగ్గట్టు నటీనటులను ఎంపిక చేసుకునే దర్శకులు మరికొందరు! ఈ రెండో కోవకు చెందినవారే దర్శకుడు శాంతకుమార్. ఈయన స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం చేసుకున్న తరువాతే నటీనటుల గురించి వేట మొదలుపెడతారు. ఈయన సినిమా టైటిల్స్ కూడా అర్థవంతంగా ఉంటాయి. అలా ఇంతకు ముందు చేసిన మౌనగురు, మహాగురు సినిమాలు రెండూ ప్రేక్షకుల ఆదరణను పొందాయి.
24 అవార్డులు గెలుచుకున్న మూవీ
వీటిలో మౌనగురు తమిళంతోపాటు తెలుగు, కన్నడం వంటి భాషల్లోనూ రీమేక్ అయింది. మహాగురు చిత్రం 30 అంతర్జాతీయ చిత్రోత్సవాల పోటీల్లో ప్రదర్శింపబడి 24 అవార్డులను గెలుచుకుంది. కాగా శాంతకుమార్ తాజాగా తెరకెక్కించిన చిత్రం రసవాది: ది ఆల్కెమిస్ట్రీ. అర్జున్‌దాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో తాన్యా రవిచంద్రన్, రమ్య సుబ్రమణియన్ హీరోయిన్లుగా నటించారు.
సిద్ధవైద్యుడు జీవితంలో జరిగే పరిణామాలే
నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రసవాది ఈ నెల 10వ తేదీన తెరపైకి రానుంది.దీని గురించి దర్శకుడు శాంతకుమార్ మాట్లాడుతూ.. ఒక సిద్ధవైద్యుడు జీవితంలో జరిగే పరిణామాలే రసవాది అని చెప్పారు. ఇది ప్రేమ, యాక్షన్, థ్రిల్లర్ కథాంశంతో కూడిన చిత్రంగా ఉంటుందన్నారు. తాను కథను సిద్దం చేసుకున్న తరువాతనే అందుకు తగిన నటీనటులను ఎంపిక చేసుకుంటానని, ఈ మూవీకి కూడా అదే పద్ధతి ఫాలో అయినట్లు చెప్పారు.
కంఫర్ట్ కోసమే..
కంఫర్ట్ కోసమే ఈ సినిమాకు నిర్మాతగా మారానన్నారు. ఈ నెల 10వ తేదీన పలు చిత్రాలు విడుదల కానున్నాయి. వాటికి పోటీగా మీ చిత్రాన్ని విడుదల చేసే ధైర్యం చేయడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు తమ చిత్రాన్ని చూసే ప్రేక్షకులు ఉంటారన్న నమ్మకమేనని దర్శకుడు శాంతకుమార్ బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment