నియోజక వర్గాన్ని పట్టించుకోని ‘లెజండ్’రీ
పొరపాటున ప్రశ్నించారా..? దబిడి దిబిడే
కన్నెత్తి చూడని ‘పురం’లో పీఏలే పెత్తందార్లు
నియోజకవర్గంలో ‘అఖండ’గా వెలిగిపోతున్న అక్రమాలు, అవినీతి
హామీలు విస్మరించడంలో ‘బావ’ను మించిపోయారనే విమర్శలు
ఎన్నికల సమయంలో ప్రచార రంగంలోకి మళ్లీ భార్య
‘అన్యాయం జరిగితే అరగంట లేటుగా వస్తానేమో.. కానీ ఆడపిల్లకు ఆపద వస్తే అర నిమిషం కూడా ఆలస్యం చేయను’
– ఇది వెండితెరపై వీర లెవల్ డైలాగ్
కట్ చేస్తే..
ఆడది కనిపిస్తే ‘ముద్దు’ అయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి – ఇది రియల్ లైఫ్‌లో ముసుగు తొలగించిన మన నాయకుడి ముతక డైలాగ్
‘నీకు బీపీ వస్తే నీ పీఏ వణుకుతాడేమో.. నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది’
రాజకీయాల్లో మాత్రం తనదాకా ఎందుకనుకున్నారేమో.. ప్రజలను వణికించడానికి నియోజకవర్గంలో పీఏలకే పెత్తనాన్ని అప్పగించేశారు.
సాక్షి టాస్క్‌ఫోర్స్: సినిమాల్లో వీర లెవల్ డైలాగులు పలికే ఆ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మాత్రం ఫెయి ల్యూర్ నేతగా మిగిలిపోయారు. అభివృద్ధి, ప్రతిపక్షంపైనా భారీ సంభాషణలు పలికే ఆయన ప్రజల సమస్యలు తీర్చడంలో జీరోగా మారారు. సెల్యూలాయిడ్‌పై తన నటనతో ఈలలు, చప్పట్లు కొట్టించుకునే ఆయన ప్రజా జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించి అభినందనలు పొందలేకపోయారు.
గడిచిన పదేళ్లలో ఆయన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్టకపోవడం, కనీసం స్థానికంగా ఉండే లోటు పాట్లు, సమస్యలపై పదిశాతం కూడా అవగాహన లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న ఆయన తీరుపై అక్కడి ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం నెలకోసారి కూడా నియోజకవర్గంలో పర్యటించని నేత తమకెందుకని, తమ సమస్యలు తీర్చి అక్కున చేర్చుకునే స్థానిక నేతలే తమక కావాలని వారు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ పదేళ్లలో చాలా హామీలిచ్చినా వాటిని తీర్చలేకపోయారు.
రాష్ట్రంలో ఆ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజలు గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఆ కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. వెండి తెరపై మన్ననలు పొందిన మాజీ సీఏంతో పాటు ఆ కుటుంబానికి చెందిన మరో ఇద్దరిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. అయితే మరీ ముఖ్యంగా గడిచిన దశాబ్ద కాలంగా ఎమ్మెల్యే ఉన్న ఆయన ఆ ప్రాంతాన్ని గాలికొదిలేశారు. సినిమా షూటింగులు, కుటుంబ వ్యవహారాలు, హైదరాబాద్‌లో స్థిరనివాసం వెరసి ఆయన ఏడాదికి ఒకట్రెండుసార్లు పర్యటనకు మాత్రమే పరిమితమయ్యారు.
పీఏలదే పెత్తనం
ఎమ్మెల్యే స్థానికంగా ఉండాలనేది అక్కడి ప్రజల మనోగతం. కానీ అరిచి గీపెట్టినా ఆయన అక్కడికి వెళ్లరు. దీంతో ఆయన నియమించుకున్న ప్రైవేటు పీఏలదే పెత్తనం. అంతేకాదు షాడో ఎమ్మెల్యేగా కూడా వీళ్లే వ్యవహరిస్తుంటారు. ఆయనకు పీఏగా ఉన్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పేరు కలిగిన వ్యక్తి గతంలో కర్ణాటకలో పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. అనంతరం రిమాండుకు వెళ్లారు. అయినా సరే మళ్లీ ఆయన్నే పీఏగా కొనసాగిస్తున్నారు.
ఆ పీఏతోపాటు మరో ఇద్దరు కూడా పీఏలుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో పీఏలు అంతులేని అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా పంచాయతీలు తీర్చడం, సెటిల్‌మెంట్‌లు చేయడంలో వారు ఆరితేరారు. నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. ఈ పదేళ్లలో వారు ఎలాంటి సమస్యను తీర్చడానికి కూడా ఆసక్తి కనబరచలేదు. కేవలం అయ్యగారు చెప్పిందే వేదంగా పనిచేశారు. పచ్చ నేతలకే అందుబాటులో ఉండేవారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తాము ఎదుర్కొనే సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక అక్కడి ప్రజలు గందరగోళానికి లోనవుతున్నారు.
ప్రచార రంగంలోకి మళ్లీ ఫ్యామిలీ
మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ‘పురం’లో ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఎమ్మెల్యే ఆయన భార్య కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే భార్య అక్కడికి వచ్చి చీరలు పంచినట్టు తెలిసింది. నియోజకవర్గంలో చుట్టిముట్టేలా ప్రచారం ముమ్మరం చేసి కొత్త హామీలు ఇస్తున్నారు. త్వరలోనే కుమారుడు, కూతుళ్లను కూడా ప్రచారానికి దించబోతున్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు.
కానీ అవి ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయని పురం ప్రజలు వాపోతున్నారు. భూగర్భ డ్రెయినేజీ సమస్య పరిష్కరిస్తానని, రోడ్ల విస్తరణ చేపడతానని ఇచి్చన హామీలు నెరవేర్చలేకపోయారు. క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తానని ఇచి్చన హామీ అలాగే ఉంది. హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడంలో బావను మించిపోయారనే విమర్శలున్నాయి. వాటిని అమలుపరచకపోగా మళ్లీ ఇప్పుడు కొత్త హామీలు గుప్పిస్తున్నారు.
సెంటిమెంటును గౌరవించని తీరు
1985లో నటుడు, మాజీ సీఎం ఇక్కడ మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. అప్పటి నుంచి ఆ కుటుంబమంటే ఇక్కడి ప్రజలకు గౌరవం. ఆ గౌరవంతోనే ఆయన కుమారులను ఎమ్మెల్యేలుగా చేశారు. ఆ కుటుంబమంటే ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉండటమే ఇక్కడి ప్రజలకు శాపమైంది. దీన్ని ప్రజల బలహీనతగా భావించిన ప్రస్తుత ఎమ్మెల్యే ఇక్కడకు రావడమే మానేశారు. మేము వచి్చనా రాకపోయినా మాకే ఓటేస్తారన్న ధీమా ఆయనది. 2014లోనూ, 2019లోనూ ఇక్కడి నుంచి ఆయన్ను అసెంబ్లీకి పంపించారు.
కానీ ఆయన ఇక్కడి సమస్యలను మాత్రం ‘పురం’ పొలిమేర దాటించలేకపోయారన్న విమర్శలున్నాయి. ఎప్పుడూ అక్కడి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన పాపాన పోలేదు. వేసవి వచి్చందంటే తాగునీటితో అల్లాడే ఇక్కడి ప్రజలు తమ కష్టాలు తామే తీర్చుకోవాలన్నట్టు చెబుతుంటారు. ఇదే విషయమై ఇటీవల ఓ టీడీపీ నేత ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘‘నాకు ఓటు వేయడం వాళ్ల అదృష్టం.ఆ అవకాశం అందరికీ రాదు . మీరు నోరు మూసుకుని చెప్పింది చేయండి’’ అని గర్జించారట.
కేంద్రం నిధులిచి్చనా..
నియోజకవర్గ కేంద్రంలో ఎప్పటినుంచో తాగునీటి సమస్య ఉంది. 1984 నుంచి ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఎటువంటి అభివృద్ధీ లేదు. అమృత్ స్కీం ద్వారా టీడీపీ హయాంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి రూ.194 కోట్లతో పైప్‌లైన్ వేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో మున్సిపాలిటీపై రూ.100 కోట్ల భారం పడింది. ఈ డబ్బుకు వడ్డీ చెల్లించేందుకు మున్సిపాలిటీ ఆదాయం సరిపోవడం లేదు. దీంతో పురం మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.
Comments
Please login to add a commentAdd a comment