లోక్‌సభ ఎన్నికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కాంగ్రెస్
గాంధీభవన్‌లో విడుదల చేయనున్న టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి
ఐటీఐఆర్, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, పాలమూరుకు జాతీయ హోదా సహా 23కుపైగా హామీలు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను టీపీసీసీ శుక్రవారం విడుదల చేయనుంది. ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి ఈ ‘తెలంగాణ మేనిఫెస్టో’ను విడుదల చేయనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నిజానికి గత నెల 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలోనే తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయాలని టీపీసీసీ నేతలు భావించారు. 23కుపైగా హామీలతో దానిని సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. తాజాగా శుక్రవారం విడుదల చేయనున్నారు.
టీపీసీసీ తెలంగాణ మేనిఫెస్టోలో హామీలివే!
ఐటీఐఆర్ ఏర్పాటు; ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ; బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ; హైదరాబాద్‌లో ఐఐఎం; హైదరాబాద్, విజయవాడ హైవేలో ర్యాపిడ్ రైల్వే సిస్టం; మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు; భద్రాచలం సమీపంలోని ఏటపాక, గుండాల, పురుషోత్తమ పట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం; పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా;
హైదరాబాద్‌లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం; కొత్త ఎయిర్‌పోర్టులు; రామగుండం–మణుగూరు రైల్వే లైన్; కొత్తగా నాలుగు సైనిక్ స్కూళ్లు; కేంద్రీయ విశ్వ విద్యాలయాల పెంపు; నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు; నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు; ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఏఎస్‌ఈఆర్ ) ఏర్పాటు; ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్; నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ;
ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) క్యాంపస్ ఏర్పాటు; అధునాతన వైద్య, ఆరోగ్య పరిశోధన కేంద్రం; 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు కేటాయింపు; ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ యూనిట్; ఐదు పారిశ్రామిక కారిడార్‌ల నిర్మాణం (హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్– నాగ్‌పూర్, హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్–నల్లగొండ–మిర్యాలగూడ, సింగరేణి పారిశ్రామిక కారిడార్); ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్‌మెంట్ హబ్; మేడారం జాతరకు జాతీయ హోదా; న్యూ డ్రైపోర్టు; హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు.
Comments
Please login to add a commentAdd a comment