చేపల కూర తెచ్చిన తంటా! | Sakshi
Sakshi News home page

చేపల కూర తెచ్చిన తంటా!

Published Tue, Feb 5 2019 11:25 AM

Married Woman Commits Suicide Attempt in Tamil Nadu - Sakshi

టీ.నగర్‌: చేపల కూర కోరిన అత్తతో తగాదా పడి ఓ మహిళ ఆదివారం ఇద్దరు కొడుకులతో కలిసి విషం సేవించింది. ఇందులో ఇద్దరు కుమారులు చనిపోగా, ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. విల్లుపురం జిల్లా, దిండివనం సందైమేడు ప్రాంతానికి చెందిన ప్రభు (32) ఆటోడ్రైవర్‌. ఇతని భార్య అమ్ము (28). వీరికి కమలేష్‌ (8), యోగేష్‌ (2) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కమలేష్‌ మూడో తరగతి చదువుతున్నాడు. అనారోగ్యానికి గురైన ప్రభు రెండు నెలల క్రితం మృతిచెందాడు.

దీంతో అమ్ము తన ఇద్దరు కొడుకులు సహా అత్త మీన (55)తో కలిసి ఉంటున్నారు. ఇదిలాఉండగా ఆదివారం ఉదయం చేపల పులుసు చేయమని అత్త మీనా, అమ్మును కోరింది. దీంతో ఇరువురి మధ్య తగాదా ఏర్పడింది. దీంతో మనస్తాపానికి గురైన అమ్ము ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి తానూ సేవించింది. దీంతో స్పృహతప్పిన వారిని ఇరుగుపొరుగు వారు చికిత్సల కోసం దిండివనం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ కమలేష్, యోగేష్‌ మృతిచెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అమ్మును మెరుగైన చికిత్స కోసం పుదుచ్చేరి జిప్మర్‌ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వైద్యులు ఆమెకు తీవ్ర చికిత్సలు అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement