‘జట్టును సర్వనాశనం చేశారు.. వాళ్లను విడదీశారు’ Former PCB chairman Ramiz Raja criticized the management after Pakistan's T20I series loss to England | Sakshi
Sakshi News home page

జట్టును సర్వనాశనం చేశారు: పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ ఫైర్

Published Sat, Jun 1 2024 4:34 PM | Last Updated on Sat, Jun 1 2024 5:28 PM

Satyanash Kar Diya Hai: Ex PCB Chief On Pakistan Ahead Of T20 WC 2024

బాబర్‌ ఆజం

టీ20 ప్రపంచకప్‌-2024 ఆరంభానికి ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0తో ఓటమిపాలైంది. రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా.. మిగిలిన రెండింటిలో బట్లర్‌ బృందం చేతిలో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది.

కాగా వన్డే ప్రపంచకప్‌-2023లో కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే పాకిస్తాన్‌ నిష్క్రమించడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కెప్టెన్‌ బాబర్‌ ఆజం నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడు.

ఫలితంగా అతడి స్థానంలో టీ20లకు పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది, టెస్టులకు షాన్‌ మసూద్‌ను కెప్టెన్లుగా నియమించింది అప్పటి పాక్‌ క్రికెట్‌ బోర్డు. అయితే, వీరిద్దరి సారథ్యంలో పాక్‌ ఆస్ట్రేలియా(టెస్టు), న్యూజిలాండ్‌(టీ20) వైట్‌వాష్‌కు గురైంది.

తిరిగి కెప్టెన్‌గా
మరోవైపు.. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డులోనూ ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో వన్డే, టీ20లకు బాబర్‌ ఆజం తిరిగి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ప్రపంచకప్‌-2024లోనూ జట్టును ముందుండి నడిపించనున్నాడు.

అయితే, అంతకంటే మందు మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లండ్‌ చేతిలో పాక్‌ ఇలా పరాభావానికి గురైంది. ఈ నేపథ్యంలో పీసీబీ మాజీ చైర్మన్‌ రమీజ్‌ రాజా మేనేజ్‌మెంట్‌ తీరుపై మండిపడ్డాడు. ప్రయోగాలకు పోయి జట్టును సర్వనాశనం చేశారంటూ తీవ్రస్థాయిలో విమర్శించాడు.

ఇప్పటికే జట్టును సర్వనాశనం చేసేశారు
‘‘ఇప్పటికైనా ప్రయోగాలు ఆపండి. సరైన కూర్పుతో జట్టును బరిలోకి దించండి. స్ట్రైక్‌రేటు అనే ఫోబియా నుంచి బయటపడండి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు అంతగా దంచికొట్టే ఆటగాళ్లు లేరు.

ఇప్పటికే జట్టును సర్వనాశనం చేసేశారు. అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీ(బాబర్‌ ఆజం- మహ్మద్‌ రిజ్వాన్‌)ను విడదీశారు. మిడిలార్డర్‌లో ఎవరిని ఆడించాలో మీకే స్పష్టత లేదు.

ఇద్దరు వికెట్‌ కీపర్లు ఎందుకు?
ఆల్‌రౌండర్లందరినీ తెచ్చి మిడిలార్డర్‌లో కుక్కేశారు. ఇద్దరు వికెట్‌ కీపర్లు తుదిజట్టులో ఆడుతున్నారు. ఫాస్ట్‌ బౌలర్లను తరచూ మారుస్తున్నారు. మీ స్పిన్నర్లు బంతిని ఏమాత్రం స్పిన్‌ చేయడం లేదు.

వాళ్లలో అసలు ఆత్మవిశ్వాసం కనబడటం లేదు. తుదిజట్టు నుంచి ఇమాద్‌ వసీం(స్పిన్నర్‌)ను ఎందుకు తప్పించారు?.. మిగతా వాళ్ల స్థానాల విషయంలోనూ క్లారిటీ లేదు. 

ఏదేమైనా టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా ఈవెంట్‌కు ముందు జట్టును మొత్తం భ్రష్టుపట్టించారు’’ అని మాజీ బ్యాటర్‌ రమీజ్‌ రాజా పాక్‌ బోర్డు తీరును తూర్పారబట్టాడు.

కాగా కివీస్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా సయీమ్‌ ఆయుబ్‌ను ఓపెనర్‌గా ప్రమోట్‌ చేసిన పీసీబీ.. బాబర్‌ను వన్‌డౌన్‌లో ఆడించింది. 21 ఏళ్ల ఆయుబ్‌ న్యూజిలాండ్‌తో సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం 52 పరుగులు చేశాడు. 

కాగా టీ20లలో పాక్‌ అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీగా బాబర్‌- రిజ్వాన్‌ రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. గత టీ20 ప్రపంచకప్‌-2022లో 105 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 

ఇక ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ జూన్‌ 6న యూఎస్‌ఏతో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి టీమిండియాను జూన్‌ 9న ఢీకొట్టనుంది.

చదవండి: రోహిత్‌, విరాట్‌ భార్యలను గమనిస్తేనే తెలిసిపోతుంది: గంగూలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement