సెల్ఫీ కోసం ముక్కు కోసుకుంటున్నారు! | Sakshi
Sakshi News home page

ముక్కు కోసుకుంటున్నారు!

Published Sat, Mar 3 2018 12:55 AM

Your nose isn’t really as big as it looks in selfies - Sakshi

వాషింగ్టన్‌: ఇప్పుడు చాలా మందికి సెల్ఫీలు తీసుకోవడమంటే మహా సరదా. ఈ సెల్ఫీల పిచ్చి ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఫొటోల్లో తమ ముక్కు పెద్దదిగా కనిపిస్తోందనీ, శస్త్రచికిత్స ద్వారా దాని పరిమాణాన్ని తగ్గించాలంటూ ప్లాస్టిక్‌ సర్జన్ల దగ్గరకు అనేకమంది వరుసలు కడుతున్నారు. సెల్ఫీ ఫొటో తీసుకునేటప్పుడు ఫోన్‌ను ముఖానికి దగ్గరగా పెట్టాల్సి రావడం వల్లనే ముక్కు అలా కనిపిస్తోంది తప్ప వాస్తవానికి సమస్యేమీ లేదని వైద్యులు చెబుతున్నా వారు వినడం లేదు. దీంతో ప్లాస్టిక్‌ సర్జన్లకు మంచి గిరాకీ ఏర్పడుతోంది. ఈ విషయాన్ని అమెరికాలోని ప్లాస్టిక్‌ సర్జన్ల పత్రిక ‘జామా ఫేషల్‌ ప్లాస్టిక్‌ సర్జరీ’ ఇటీవల ప్రచురించింది.

30 శాతం పెద్దదిగా కనిపిస్తుంది..
ముఖానికి కెమెరా లెన్స్‌ 12 అంగుళాల కంటే తక్కువ దూరంలో ఉంటే సెల్ఫీల్లో ముక్కులు అసలు సైజు కన్నా 30 శాతం పెద్దగా కనిపిస్తాయి. ఇది గమనించకుండా అనేక మంది ఆపరేషన్‌ చేసి తమ ముక్కును అందంగా తీర్చిదిద్దాలంటూ తన క్లినిక్‌ వచ్చి అడుగుతున్నారని అమెరికాలోని రట్జర్స్‌ యూనివర్సిటీలో పనిచేసే ఫేషల్‌ ప్లాస్టిక్‌ సర్జన్‌ బోరిస్‌ పాష్కోవర్‌ తెలిపారు. ఈయన తన సహచరులతో కలసి రాసిన వ్యాసాన్నే జామా ఫేషల్‌ ప్లాస్టిక్‌ సర్జరీ ప్రచురించింది.

అమెరికన్‌ ఫేషల్‌ ప్లాస్టిక్, రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జన్ల అకాడమీ ప్రజల్లో కనిపిస్తున్న ఈ వేలం వెర్రిని గమనించింది. సెల్ఫీల్లో అందంగా కనిపించేలా చేయాలంటూ అనేక మంది తమను కలుస్తున్నారని 2017లో జరిపిన ఓ సర్వేలో 55 శాతం ఫేషల్‌ ప్లాస్టిక్‌ సర్జన్లు చెప్పారు. ‘సెల్ఫీల్లో ముక్కు పెద్దదిగా కనిపిస్తోందంటూ అనేకులు నా దగ్గరకు వస్తున్నారు. వారి ముక్కు పెద్దగా ఏమీ లేదనీ, కెమెరాను దగ్గరగా ఉంచి సెల్ఫీ తీయడం వల్లే పరిమాణంలో పెద్దగా కనిపిస్తోందని చెబుతున్నాను’ అని తెలిపారు.  కెమెరాను దూరంగా పెడితే ముక్కు సైజు తగ్గుతుందని ఆయన వెల్లడించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement