భానుడి ప్రతాపానికి ఆరుగురి బలి | Sakshi
Sakshi News home page

భానుడి ప్రతాపానికి ఆరుగురి బలి

Published Fri, May 22 2015 11:33 PM

six people died because of sunstroke

సిద్దిపేట రూరల్/పెద్దశంకరంపేట/కల్హేర్ /రేగోడు/జోగిపేట/దౌల్తాబాద్ : జిల్లాలోని వేర్వురు ప్రాంతాల్లో వడదెబ్బకు గురై ఆరుగురు మృత్యువాత పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట మండలం   గ్రామానికి చెందిన రోమాల చిన్నోళ్ల పోచయ్య (75) గురువారం ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. దీంతో ఇంటికి వచ్చి ఆయాస పడుతూ ఇబ్బందికి గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబీకులు అతడిని కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పోచయ్య మృతి చెందాడు. మృతుడికి భార్య బాలవ్వ ఉంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ కుంబాల లక్ష్మి, గ్రామస్తులు కోరారు.

 పెద్దశంకరంపేట మండలం టెంకటి గ్రామానికి చెందిన కమలాని అంజమ్మ (52) గురువారం సాయంత్రం తనకున్న 10 గుంటల చేనులో మక్క కొయ్యలు వేరడానికి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీ కులు ఆమెను శుక్రవారం ఉదయం 108లో జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందింది.  మృతురాలికి ఒక కుమారుడు ఉండగా.. అతను హైదరాబాద్‌లో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.  

 కల్హేర్ మండలం బీబీ పేట గ్రామానికి చెందిన గుండు లచ్చవ్వ (60) గురువారం తన సొంత వ్యవసాయ పొలంలో వరి కోత పని చేసేందుకు వెళ్లింది. ఎండ తీవ్రతతో వడ దెబ్బకు గురైంది. పనులు చేసుకుని ఇంటికి వచ్చిన లచ్చవ్వ వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు రాత్రి స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించారు. అయినా కోలుకోలేదు.  బాధిత కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించాలని  స్థానిక జెడ్పీటీసీ గుండు స్వప్న అధికారులను కోరారు.

 రేగోడు మండలం కొత్వాన్‌పల్లికి చెందిన అంజమ్మ (45) ఎల్లమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొని ఇంటికి వెళుతుం డగా వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయింది. అక్కడ ఉన్న వారు నీళ్లు తాగించే ప్రయత్నం చేయగా అప్పటికే అంజమ్మ మృతి చెందింది.

 జోగిపేట మండలం నేరడిగుంటకు చెందిన తుక్కపురం మల్లేశం (35) రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా  సంగాయని చెరువులో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే శుక్రవారం ఉదయం నుంచి ట్రాక్టర్ ద్వారా రైతుల పొలాల్లోకి మట్టిని తరలిస్తున్నాడు. కాగా.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అస్వస్థతకు గురైన మల్లేశం ఒకేసారి కుప్పకూలాడు. దీంతో తోటి కూలీలు ఆటోలో అతడిని జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సలు పొందుతూ మృతి చెందాడు. మల్లేశం మృతితో గ్రామంలో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ పథకం పనుల్లో పాల్గొని మరణించిన మల్లేశం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

 దౌల్తాబాద్ మండలం సూరంపల్లికి చెందిన బొల్లం లక్ష్మి (45) 20 రోజులు గా గజ్వేల్ - సిద్దిపేట రహదారిలో జరుగుతున్న తారు రోడ్డు మరమ్మతుల పనికి కూలీగా వెళుతోంది. శుక్రవారం కూడా కూలీ పనికి వెళ్లింది. అయితే మధ్యాహ్నం ఎండ వేడికి తాళలేక పనిచేస్తున్న చోటే సొమ్మసిల్లి పడిపోయింది. తీటి వారు ఆమెకు సపర్యాలు చేస్తుండగానే మృతి చెందింది. కాగా మృతురాలి భర్త పోచయ్య నాలుగునెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. లక్ష్మికి నలుగురు కుమార్తెలు కాగా.. వీరిలో ముగ్గురికి పెళ్లిళ్లు కాగా.. చిన్న కుమార్తె మమత అనాథగా మారింది.

Advertisement
 
Advertisement
 
Advertisement