‘దేశం’.. గందరగోళం! | Sakshi
Sakshi News home page

‘దేశం’.. గందరగోళం!

Published Tue, Apr 23 2024 8:40 AM

మడకశిరలో టీడీపీ జెండాలను చెప్పులతో కొడుతున్న ఆ పార్టీ మహిళా కార్యకర్తలు - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎండలతో పాటే రాజకీయ వాతావరణమూ బాగా హీటెక్కింది. ఎన్నికల్లో మొదటి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. అయినా, నేటికీ టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఎక్కడో ఒక చోట ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు ఫ్లెక్సీలు తగులబెట్టడం, బొమ్మలను చెప్పులతో కొట్టడం చేస్తున్నారు.

అభ్యర్థుల డీలా..

టీడీపీలో చివరి నిమిషం వరకూ బీ ఫారం ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి. ఉన్నత చదువులు చదివిన డాక్టరుకు టికెట్‌ ఇచ్చానని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు.. రెండు వారాల్లోనే మడకశిరలో అభ్యర్థిని మార్చి అగ్గి రాజేశాడు. రాప్తాడు నియోజకవర్గంలో సునీత, శ్రీరాం ఇద్దరూ నామినేషన్‌ వేయడంతో అభ్యర్థి ఎవరో ఇప్పటికీ తెలియక ఆ పార్టీ కేడర్‌ తికమకపడుతున్నారు. పుట్టపర్తిలో కోడలికి వద్దని తనకే టికెట్‌ ఇవ్వాలని ఇప్పటికీ పల్లె రఘునాథరెడ్డి చంద్రబాబు వద్ద ప్రాధేయపడుతున్నట్టు సమాచారం. ఈనెల 25 వరకూ ఎప్పుడు ఏం జరుగుతుందో తాము చెప్పలేమని టీడీపీ పార్టీ అభ్యర్థులే వాపోతున్నారు. చంద్రబాబు చర్యలతో ఆ పార్టీ అభ్యర్థులు పూర్తిగా డీలా పడిపోయినట్లు తెలుస్తోంది.

దూసుకుపోతున్న వైఎస్సార్‌ సీపీ..

ఎన్నికల కదనరంగంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం దూసుకుపోతోంది. ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గడిచిన నెలన్నర రోజులుగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు జనంతో మమేకమై తిరుగుతున్నారు. అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థులను ప్రకటించడంతో జనంలోనూ ఒక నమ్మకం ఏర్పడింది.

అభ్యర్థులకు నీరాజనం..

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా జనం నీరాజనం పడుతున్నారు. సోమవారం అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ అభ్యర్థిగా వై.విశ్వేశ్వరరెడ్డి నామినేషన్లు వేశారు. వేలాది మంది సమక్షంలో అనంత, విశ్వ నామినేషన్లు దాఖలు చేశారు. అశేష జన వాహిని మధ్య నామినేషన్లు దాఖలు చేయడం అభ్యర్థుల గెలుపునకు సంకేతాలుగా చెప్పుకోవచ్చు.

నేడు ఈరలక్కప్ప నామినేషన్‌..

అత్యంత సాధారణ వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి చరిత్ర సృష్టించిన పార్టీ వైఎస్సార్‌ సీపీ. అలా వైఎస్సార్‌ సీపీ టికెట్‌ పొందిన ఉపాధి హామీ కూలీ ఈర లక్కప్ప నేడు మడకశిరలో నామినేషన్‌ వేయనున్నారు. టిప్పర్‌ డ్రైవర్‌ అంటూ చంద్రబాబు హేళన చేసిన మరో సాధారణ వ్యక్తి వీరాంజనేయులు.. శింగనమల నియోజకవర్గంలో ఈనెల 24న నామినేషన్‌ వేయనున్నారు. అదే రోజు రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, 25న గుంతకల్లులో వెంకట్రామిరెడ్డి, రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి, కదిరిలో మక్బూల్‌ నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

నామినేషన్‌ గడువు రెండు రోజులే

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల్లో జోష్‌

టీడీపీలో మాత్రం సందిగ్ధం

తాజాగా మడకశిర అభ్యర్థి మార్పుతో ‘తమ్ముళ్ల’ తికమక

గెలుపుపై ఆ పార్టీ అభ్యర్థుల్లో సన్నగిల్లుతున్న నమ్మకం

Advertisement
Advertisement