Simhachalam: దర్శనానికి వచ్చి ఉంగరం దొంగిలిస్తారా..? | Sakshi
Sakshi News home page

Simhachalam: దర్శనానికి వచ్చి ఉంగరం దొంగిలిస్తారా..?

Published Fri, Apr 26 2024 12:52 PM

 Gold Ring theft at Simhachalam Temple - Sakshi

సింహగిరిపై భక్తులను ప్రశ్నించిన అర్చకులు 

దొంగిలించలేదంటూ కన్నీటిపర్యవంతమైన భక్తులు 

చివరికి వినోదోత్సవమని తెలుసుకుని సంభ్రమాశ్చర్యం 

నవ్వుల సందడిగా జరిగిన వినోదోత్సవం 

సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..’అని సింహాచలం కొండకి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించే సరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా.! స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా..’అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి.’ అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగటంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి.


దేవస్థానం అర్చకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజయనగరానికి చెందిన భక్తురాలు 

 తాము ఉంగరం తీయలేదని ఎంత చెబుతున్నా వినకుండా మీరే దొంగ అంటూ పదే పదే ప్రశ్నించడంతో వారంతా ఆగ్రహంతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని.. దొంగిలించిన ఉంగరంలా ఇవి ఉన్నాయంటూ స్థానాచార్యులు అడగటంతో భక్తుల నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని భక్తులంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ సింహగిరిపై బుధవారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వినోదోత్సవం. స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన ఉంగరం వెతికే ఘట్టాన్ని బుధవారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. 

ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టింపజేశారు. స్వామి దూతగా పురోహిత్‌ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.


టెక్కలికి చెందిన భక్తులను ప్రశి్నస్తున్న స్థానాచార్యులు 

 ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యవంతం చెందారు. ఉత్స వం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాను తొలగించారు. చివరికి స్వామి చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. ఎస్‌.కోట మండలం బొద్దాంకి చెందిన నూతన దంపతులు ఈశ్వరరావు, మాధవి, ఆరిలోవ ప్రాంతానికి చెందిన మౌళీ, గౌతమి, ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యారి్థనులు హిమజ, ప్రత్యూష, లావణ్య, శ్వేత అశ్విని, టెక్కలికి చెందిన అక్కాతమ్ముళ్లు జీవిత, నవీన్‌కుమార్‌లను పురోహిత్‌ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా దాసన్నపేటకి చెందిన రోజా అనే మహిళ తన కుమార్తె మిక్కి, అల్లుడు కిశోర్, మనవలతో కలిసి సింహగిరికి రాగా వారిని తాళ్లతో బంధించారు. 

వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమా నం వ్యక్తం చేయడంతో వారంతా వాదనకు దిగారు. నా కూతురుకు, అల్లుడికి నిశి్చతార్థం రోజు పెట్టిన ఉంగరాలు ఇవని, దొంగిలించినవి కాదని స్థానాచార్యులతో రోజా వాదించారు. ఇదిలా ఉండగా దేవస్థానం ఈవో ఎస్‌.శ్రీనివాసమూర్తి, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, ఆలయ కొత్వాల్‌ నాయక్‌ లంక సూరిబాబు, ఆలయ ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుళ్లు, సూపరింటెండెంట్‌ వెంకటరమణ, ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు సైతం దొంగలుగా పట్టుపట్టారు. తొలుత స్థానాచార్యులను కూడా తాళ్లతోనే బంధించి తీసుకురావడం విశేషం. అదే సమయంలో సింహగిరి వచ్చిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వినోదోత్సవంలో పాల్గొని.. స్వామిని దర్శించుకున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement