రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతుభరోసాపై సీఎం రేవంత్‌ కీలక ప్రకటన | Sakshi
Sakshi News home page

రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతుభరోసాపై సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

Published Sat, May 4 2024 2:07 PM

CM Revanth Key Comments Over Rythu Bandhu

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులకు శుభవార్త చెప్పారు. ఈనెల తొమ్మిదో తేదీలోపు రైతుభరోసా నిధులు జమ చేస్తామని రేవంత్‌ చెప్పారు.

కాగా, ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ..‘ఎన్నికల వేళ సీఎం రేవంత్‌ కీలక ప్రకటన చేశారు. రైతులకు శుభవార్త అందించారు. ఈనెల తొమ్మిదో తేదీలోపు రైతుభరోసా డబ్బులు జమ చేస్తామన్నారు. అలాగే, ఆగస్ట్‌ 15వ తేదీలోపు రుణమాఫీ కూడా చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా ఏడు లక్షల 60 వేల మందికి ఇప్పటికే వేశాం. మిగిలిన నాలుగు లక్షల మందికి వేస్తాం’ అని కామెంట్స్‌ చేశారు.

ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌..‘ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు దిక్సూచి. కేసీఆర్ నామా నాగేశ్వరరావును బకరాను చేస్తున్నారు. ఏ సంకీర్ణంలో చేరుతావు. ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలితే కాల్చేస్తారు. నామాకు సూచన చేస్తున్నాను. కేసీఆర్ మాటలు వినకు. గత డిసెంబర్‌ మూడో తేదీన ఫలితాలు సెమీ ఫైనల్స్‌. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఫైనల్‌ తీర్పు రాబోతుంది. గుజరాత్‌ టీమ్‌ను ఇంటికి పంపించాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతుంది. రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి కాబోతున్నారు’ అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

అయితే, రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో సీఎం రేవంత్‌ ఇలాంటి ప్రకటన చేయడం కోడ్‌ ఉల్లంఘనకు కిందకు వస్తుందని ప్రతిపక్ష పార్టీల నేతలు కామెంట్స్‌ చేస్తున్నారు. అలాగే, ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసమే రేవంత్‌ ఇలాంటి కామెంట్స్‌ చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రిజర్వేషన్ల రక్షణకు సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. తప్పుడు కేసులతో ఢిల్లీకి పిలిస్తే భయపడతామా?. రాజ్యాంగాన్ని కాపాడతామని రాహుల్ గాంధీ చెప్పిన మాటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాలం చెల్లిన థర్మల్ పవర్ స్టేషన్లను తిరిగి వాడకంలోకి తెస్తాం. కార్మికులకు రావాల్సిన లాభాలు ఇవ్వకుండా, సింగరేణికి బొగ్గు బావులు తవ్వకుండా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మొద్దు నిద్రపోయింది.

సింగరేణి పరిసరాల్లోని బొగ్గు బావులన్నీ ప్రైవేటు వ్యక్తులకు కాకుండా సింగరేణికే చెందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. కొత్తగూడెంలో స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ తెరిపించి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం. రాబోయే ఐదేళ్లలో డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెప్పపాటుసేపు కూడా కరెంటు పోవడం లేదు. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతున్నాం. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆగిపోయే ప్రసక్తే లేదు. మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. రాహుల్‌ను ప్రధానిని చేయడానికి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రఘురామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని కామెంట్స్‌ చేశారు. 

Advertisement
Advertisement