
బజాజ్ ఫైనాన్స్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉపశమనం కల్పించింది. బజాజ్ ఫైనాన్స్‌కు సంబంధించిన రెండు ఉత్పత్తులు ఈకామ్ (eCOM), ఆన్‌లైన్ డిజిటల్ ఇన్‌స్టా ఈఎంఐ (Insta EMI) కార్డ్‌పై ఉన్న ఆంక్షలను తక్షణమే తొలగించింది. ఈమేరకు కంపెనీ మే 2న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
ఈఎంఐ కార్డ్‌ల జారీతో సహా రెండు వ్యాపార విభాగాలలో రుణాల మంజూరు, పంపిణీని ఇప్పుడు పునఃప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. 2023 నవంబర్ 15న బజాజ్ ఫైనాన్స్ లెండింగ్ ఉత్పత్తులైన ఈకామ్, ఇన్‌స్టా ఈఎంఐ కార్డ్ కింద రుణాల మంజూరు, పంపిణీని తక్షణమే నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. తమ డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలు, నిబంధనలకు కంపెనీ కట్టుబడి ఉండకపోవడంతో ఆంక్షలు విధించింది.
ఆర్బీఐ గత సంవత్సరం తమ రెండు రుణ ఉత్పత్తులపై వ్యాపార పరిమితులను విధించిన తర్వాత అవసరమైన మార్పులు చేసినట్లు బజాజ్ ఫైనాన్స్ ఏప్రిల్ 25న జనవరి-మార్చి ఫలితాలను ప్రకటిస్తూ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీన్ని అనుసరించి, ఆంక్షలను సమీక్షించాలని ఆర్బీఐని అభ్యర్థించింది.