ఏపీ మీడియా అకాడమీకి కొమ్మినేని రాజీనామా | Sakshi
Sakshi News home page

ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా

Published Sat, Jan 13 2024 3:23 PM

Kommineni Srinivasa Rao Resign For AP Press Academy Chairman Post - Sakshi

విజయవాడ, సాక్షి: సీఆర్‌ ఏపీ మీడియా అకాడమీ(సీ రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ) చైర్మన్ పదవికి సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టత ఇచ్చారాయన. తనపై నమ్మకంతో మీడియా అకాడమీ చైర్మన్‌గా నియమించి.. పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారాయన.  

సీనియర్‌ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు.. 2022 నవంబర్ 10వ తేదీన ఏపీ మీడియా అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ 13 నెలల 15 రోజులు  కాలంలో  వర్కింగ్ జర్నలిస్టుల కోసం పలుకార్యక్రమాలు  చేయగలగడం సంతృప్తినిచ్చిందని ప్రకటనలో పేర్కొన్నారాయన. అయితే.. ఈ నెల 16 వరకు సంక్రాంతి నేపథ్యంలో సెలవులు ఉండడంతో.. 17 వ తేదీ నుంచి తన రాజీనామా  అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు.

ఇక సీఆర్‌ ఏపీ మీడియా అకాడమీ చైర్మన్‌ హోదాలో అందించిన సేవల్ని ఆయన గుర్తు చేసుకున్నారు. గ్రామీణ, పట్టణ జర్నలిస్టులు, జర్నలిజం పై అభిరుచి కలిగిన వ్యక్తుల కోసం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో "జర్నలిజం లో డిప్లమో" కోర్సును నాగార్జున యూనివర్సిటీ సహకారంతో పూర్తి చేయడం తమకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయంగా చెప్పారాయన. అదేవిధంగా, డిప్లమో కోర్సు తో పాటుగా, ప్రతి శనివారం వర్కింగ్ జర్నలిస్టులకోసం సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాల పై ఆన్ లైన్ శిక్షణ తరగతులు నిర్వహించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ముఖ్యమంత్రి జగన్‌ ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు పత్రికా ముఖంగా ప్రజలకు వివరించగలిగామని ఆయన పేర్కొన్నారు. 

అనంతపురం నుంచి ఉద్దానం (శ్రీకాకుళం జిల్లా) వరకు జరిపిన పర్యటనల్లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోజెక్టుల అభివృద్ధిని, ఉద్దానం కిడ్నీ వ్యాధుల పరిశోధనా కేంద్రం వంటి అభివృద్ధిని స్వయంగా పరిశీలించి ప్రజలకు మీడియా ద్వారా వివరించగలిగామని ఆయన తెలిపారు. ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా తో పాటు సోషల్ మీడియాను కూడా సమాచార చేరవేతలో భాగస్వామిని చేయగలిగామన్నారు. తమ పదవీ కాలంలో సహకరించిన మీడియా మిత్రులందరికీ, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆ ప్రకటనలో కొమ్మినేని శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement