Pat Cummins: ఆమెపై కోపం వచ్చింది.. కానీ! | She is in Bad Books: Cummins Reveals His Sister Dragged Him to Dancing Class | Sakshi
Sakshi News home page

Pat Cummins: ఆమెపై కోపం వచ్చింది.. కానీ! ఇండియాలో ఉన్నన్ని రోజులు..

Published Tue, Jun 4 2024 1:28 PM | Last Updated on Tue, Jun 4 2024 1:51 PM

She is in Bad Books: Cummins Reveals His Sister Dragged Him to Dancing Class

ఇండియాలో ఉన్నన్ని రోజులు తమ కుటుంబం ఎంతో సంతోషంగా గడిపిందని ఆస్ట్రేలియా సారథి, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్ ప్యాట్‌ కమిన్స్‌ అన్నాడు. ఐపీఎల్‌-2024 నేపథ్యంలో తొలిసారిగా తమ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చిందని.. ఎన్నో అందమైన జ్ఞాపకాలను పోగు చేసుకుందని పేర్కొన్నాడు.

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 విజేత అయిన ప్యాట్‌ కమిన్స్‌ను సన్‌రైజర్స్‌ యాజమాన్యం ఏకంగా రూ. 20.50 కోట్లు పెట్టి కొనుక్కున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని కెప్టెన్‌గా నియమించగా.. అనూహ్య రీతిలో జట్టు పుంజుకుంది.

గత మూడేళ్ల వైఫల్యాలకు చరమగీతం పాడుతూ ఏకంగా ఫైనల్‌ చేరుకుంది. అయితే, తుదిపోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. అయినా.. గతం కంటే మెరుగైన ప్రదర్శన కారణంగా అభిమానుల మనసు గెలుచుకుంది కమిన్స్‌ బృందం.

ఇక ఇండియాలో ఉన్నపుడు ఆట నుంచి విరామం దొరికిన సమయంలో ప్యాట్‌ కమిన్స్‌ కుటుంబంతో కలిసి వివిధ రకాల హోటళ్లను సందర్శించి భోజనం రుచిచూశాడు. అదే విధంగా బాలీవుడ్‌ పాటకు స్టెప్పులేస్తూ ఫ్యామిలీ అంతా సరాదాగా గడిపారు.

తాజాగా ఈ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న ప్యాట్‌ కమిన్స్‌.. ఆసకిక్తకర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్‌ సాంగ్‌కు డాన్స్‌ చేయడం ఎలా అనిపించింది అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘నా సోదరి పట్టుబట్టడం వల్లే నేను డాన్స్‌ చేయాల్సి వచ్చింది.

తనే నన్ను బాలీవుడ్‌ డాన్సింగ్‌ క్లాసుకు తీసుకువెళ్లింది. ఆ తర్వాత తనే మా డాన్స్‌ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దాంతో నాకు చాలా కోపం వచ్చింది.

అయితే, ఇప్పుడు అదెంతో గొప్పగా అనిపిస్తోంది. ఐపీఎల్‌ కోసం అక్కడ ఉన్నన్ని రోజులు ఎంతో ఎంజాయ్‌ చేశాం. ఎక్కడికి వెళ్లాలి? ఎలాంటి ఫుడ్‌ తినాలి? అన్న విషయాల గురించి నా సహచర ఆటగాళ్లు మంచి సలహాలు ఇచ్చారు.

తొలిసారి నా ఫ్యామిలీ ఇండియా సందర్శించి.. అందమైన జ్ఞాపకాలు పోగు చేసుకుంది’’ అని ప్యాట్‌ కమిన్స్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు. కాగా కమిన్స్‌ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌-2024తో బిజీగా ఉన్నాడు. అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో జూన్‌ 5 ఆసీస్‌ ఒమన్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement