ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగించిన రుతురాజ్‌.. మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభణ | Maharashtra Premier League 2024: Ruturaj Gaikwad Smashed Blasting Fifty In A Match Against Kolhapur Tuskers | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగించిన రుతురాజ్‌.. మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభణ

Published Wed, Jun 5 2024 4:17 PM | Last Updated on Wed, Jun 5 2024 4:17 PM

Maharashtra Premier League 2024: Ruturaj Gaikwad Smashed Blasting Fifty In A Match Against Kolhapur Tuskers

యువ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఐపీఎల్‌ 2024 ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా జరుగుతున్న మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఈ లీగ్‌లో పూణేరీ బప్పాకు సారథ్యం వహిస్తున్న రుతు.. నిన్న (జూన్‌ 4) కొల్హాపూర్‌ టస్కర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో​ అజేయ అర్దశతకం (35 బంతుల్లో 61 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. 

ఫలితంగా పూణేరీ బప్పా 22 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్‌ తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. రుతు ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ పర్వాలేదనిపించాడు. ఈగల్‌ నాసిక్‌ టైటాన్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 21 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 38 పరుగులు చేశాడు. 

2024 ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రుతు.. మహారాష్ట్ర ప్రీమియర్‌ లీగ్‌లోనూ తన జట్టుకు (పూణేరీ బప్పా) నాయకత్వం వహిస్తున్నాడు. అయితే రుతు ఐపీఎల్‌లోలా ఎంపీఎల్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగడం లేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అతను మిడిలార్డర్‌లో బరిలోకి దిగాడు.

మ్యాచ్‌ విషయానికోస్తే.. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పూణేరీ బప్పా 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. పూణేరీ ఇన్నింగ్స్‌లో రుతురాజ్‌ మినహా ఎవరూ రాణించలేదు. 

శుభమ్‌ తైస్వాల్‌ (10), సూరజ్‌ షిండే (24), రాహుల్‌ దేశాయ్‌ (19) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. కొల్హాపూర్‌ టస్కర్స్‌ బౌలర్లలో నిహాల్‌ తుసామద్‌ 3 వికెట్లు పడగొట్టగా.. శ్రేయస్‌ చవాన్‌ 2, యశ్‌ కలాద్కర్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టస్కర్స్‌ 14 ఓవర్లు బ్యాటింగ్‌ చేసి 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. పూణేరీ బౌలర్లు పియుశ్‌ సాల్వీ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టారు. హర్ష్‌ సాంగ్వి (38), అంకిత్‌ పోర్వాల్‌ (28), అంకిత్‌ బావ్నే (21) ఓ మోస్తరు పరుగులు చేసినా టస్కర్స్‌కు ఓటమి తప్పలేదు. 

కాగా, కొద్ది రోజుల కిందట ముగిసిన ఐపీఎల్‌ 2024లో రుతురాజ్‌ సెకెండ్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో అతను 14 మ్యాచ్‌ల్లో సెంచరీ, నాలుగు అర్దసెంచరీల సాయంతో 583 పరుగులు చేశాడు. 15 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 అర్దసెంచరీల సాయంతో 741 పరుగులు చేసిన ఆర్సీబీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సీజన్‌ లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ సొంతం చేసుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement