MS Dhoni: ఐపీఎల్‌కు గుడ్‌బై?.. ధోని కీలక వ్యాఖ్యలు | Not Easy No Discount For Age: Dhoni Pours His Heart Out Amid IPL Retirement Talks | Sakshi
Sakshi News home page

MS Dhoni: ఐపీఎల్‌కు గుడ్‌బై?.. ధోని కీలక వ్యాఖ్యలు

Published Wed, May 22 2024 11:28 AM | Last Updated on Wed, May 22 2024 3:17 PM

Not Easy No Discount For Age: Dhoni Pours His Heart Out Amid IPL Retirement Talks

మహేంద్ర సింగ్‌ ధోని (PC: BCCI/IPL)

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని.. 42 ఏళ్ల వయసులోనూ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్‌-2024లో వికెట్‌ కీపర్‌గా కళ్లు చెదిరే క్యాచ్‌లతో అదరగొట్టిన తలా.. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటర్‌గానూ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు.

వింటేజ్‌ ధోనిని గుర్తు చేస్తూ పవర్‌ఫుల్‌ సిక్సర్లతో విరుచుకుపడుతూ కావాల్సినంత వినోదం పంచాడు. అయితే, ఢిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై ఈసారి ప్లే ఆఫ్స్‌ కూడా చేరకుండా నిష్క్రమించడంతో అభిమానులు నిరాశ చెందారు.

లీగ్‌ దశలోనే ముగిసిన ప్రయాణం
చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో చెన్నై ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రుతురాజ్‌ గైక్వాడ్‌ సేన ప్రయాణం లీగ్‌ దశలోనే ముగిసిపోయింది.

అయితే, ఈ మ్యాచ్‌లో ధోని మెరుపులు మెరిపించడం అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. 13 బంతుల్లో 3 ఫోర్లు, ఓ భారీ సిక్సర్‌ సాయంతో తలా 25 పరుగులు సాధించాడు. ఇక 42 ఏళ్ల ఈ ‘జార్ఖండ్‌ డైనమైట్‌’కు ఇదే ఆఖరి ఐపీఎల్‌ సీజన్‌ అన్న వార్తల నేపథ్యంలో ధోని ఫిట్‌నెస్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

క్రికెటర్‌గా కొనసాగేందుకు ఎంతో కష్టపడాలి
యువ ఆటగాళ్లతో పోటీ పడటం అంత తేలికేమీ కాదని.. క్రికెటర్‌గా కొనసాగేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘నేను ఏడాదంతా క్రికెట్‌ ఆడుతూనే ఉండను.

కేవలం లీగ్‌ క్రికెట్‌ కోసమే మైదానంలో దిగుతాను. అయినా ఎల్లప్పుడూ ఫిట్‌గానే ఉండాలి. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతూ ఫిట్‌నెస్‌ మెయింటెన్‌ చేస్తున్న యువ ఆటగాళ్లను ఎదుర్కోవాలి కాబట్టి నేనూ వారిలాగే ఫిట్‌గా ఉండాలి.

వయసును సాకుగా చూపలేం
ఎందుకంటే ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో వయసు కారణంగా ఎవరూ మనకు డిస్కౌంట్‌ ఇవ్వరు. ఒకవేళ మనం ఆడాలని నిర్ణయించుకుంటే కచ్చితంగా అందుకు తగ్గట్లుగా ఫిట్‌నెస్‌ మెయింటెన్‌ చేయాలి.

వయసును సాకుగా చూపి మనం ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. అందుకే ఆహారపుటలవాట్లు మొదలు వ్యాయామం, ప్రాక్టీస్‌ వంటి విషయాల్లో కచ్చితంగా స్ట్రిక్ట్‌గా ఉండాల్సిందే’’ అని ధోని పేర్కొన్నాడు. 

దుబాయ్‌ ఐ 103.8 చానెల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా గతేడాది సీఎస్‌కేను చాంపియన్‌గా నిలిపిన ధోని.. ఈ ఏడాది కెప్టెన్సీ నుంచి వైదొలిగి పగ్గాలను రుతురాజ్‌ గైక్వాడ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.

చదవండి: IPL 2024: వాళ్ల వల్లే గెలిచాం.. ఫైనల్లోనూ మేమే: శ్రేయస్‌ అయ్యర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement