శ్రేయస్ అయ్యర్ (PC: PTI/BCCI)
‘‘చాలా చాలా సంతోషంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించారు. మా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాను. ఈరోజు మేము ఏం చేయగలమో అదే చేసి చూపించాం. కీలకమైన ఈ మ్యాచ్‌లో మా జట్టులోని ప్రతి ఒక్క బౌలర్ తమ బాధ్యతను నెరవేర్చారు.
వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. ఇలాంటి వైవిధ్యమైన బౌలింగ్ లైనప్ ఉంటే కెప్టెన్ పని సులువవుతుంది. మా బౌలర్లంతా అద్భుతంగా రాణించారు. ఇక ముందు కూడా మా ప్రదర్శన ఇలాగే ఉంటుందని భావిస్తున్నా.
ఈరోజు గుర్బాజ్ తన తొలి మ్యాచ్ ఆడాడు. ఓపెనర్‌గా మాకు శుభారంభమే అందించాడు. ఇదే జోరులో మరింత ముందుకు వెళ్లాలని పట్టుదలగా ఉన్నాం. ఫైనల్లోనూ మా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాం’’ అని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు.
ఐపీఎల్-2024లో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. కాగా లీగ్ దశలో పద్నాలుగింట తొమ్మిది విజయాలతో టాపర్‌గా నిలిచిన కేకేఆర్.. క్వాలిఫయర్-1లోనూ సత్తా చాటింది.
అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జయభేరి మోగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు కేకేఆర్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు.
సీజన్ ఆసాంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడిన సన్‌రైజర్స్‌కు షాకిస్తూ 159 పరుగులకే కుప్పకూల్చారు. మిచెల్ స్టార్క్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునిల్ నరైన్, ఆండ్రీ రసెల్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఈ క్రమంలో నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 14 బంతుల్లో 23, సునిల్ నరైన్ 16 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేయగలిగారు.
అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్, నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ సన్‌రైజర్స్ ఫీల్డర్ల తప్పిదాల కారణంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆకాశమే హద్దుగా చెలరేగారు. వెంకటేశ్ 28 బంతుల్లో 51, శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 58 పరుగులతో దుమ్ములేపారు.
వీరిద్దరి విజృంభణతో 13.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి కేకేఆర్ 164 పరుగులు సాధించింది. సన్‌రైజర్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఫైనల్లో అడుగుపెట్టింది.
ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రేయస్ అయ్యర్ జట్టు ప్రదర్శన పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. అదే విధంగా.. మైదానంలో వెంకటేశ్ అయ్యర్‌తో తన కమ్యూనికేషన్ గురించి చెబుతూ.. ‘‘నిజానికి నాకు తమిళ్ మాట్లాడటం రాదు. అయితే, ఎదుటివాళ్లు మాట్లాడింది అర్థం చేసుకోగలను. వెంకీ తమిళ్‌లోనే మాట్లాడతాడు. నేను అతడికి హిందీలో బదులిస్తాను’’ అని తెలిపాడు.
What a memorable 𝗞𝗻𝗶𝗴𝗵𝘁 for the men in purple 💜
Unbeaten half-centuries from Venkatesh Iyer 🤝 Shreyas Iyer
The celebrations continue for the final-bound @KKRiders 😎
Scorecard ▶️ https://t.co/U9jiBAlyXF#TATAIPL | #KKRvSRH | #Qualifier1 | #TheFinalCall pic.twitter.com/xBFp3Sskqq— IndianPremierLeague (@IPL) May 21, 2024
Comments
Please login to add a commentAdd a comment