ఐపీఎల్ - 2024 ప్లే ఆఫ్స్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ మరో ముందడుగు వేసింది. రాజస్తాన్ రాయల్స్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకువచ్చింది.
చెపాక్ వేదికగా రాజస్తాన్‌తో ఆదివారం తలపడిన చెన్నై టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసింది. పేసర్ సిమర్‌జీత్ సింగ్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్ (21) వికెట్లు పడగొట్టి శుభారంభం అందించాడు.
వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ సంజూ శాంసన్(15)ను కూడా వెనక్కి పంపి రాజస్తాన్ టాపార్డర్‌ను దెబ్బకొట్టాడు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రియాన్ పరాగ్(35 బంతుల్లో 47 నాటౌట్) పోరాడగా.. ధ్రువ్ జురెల్(18 బంతుల్లో 28) అతడికి సహకారం అందించాడు. మిగతా వాళ్లు చేతులెత్తేయగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనకు దిగిన చెన్నైకి ఓపెనర్ రచిన్ రవీంద్ర(18 బంతుల్లో 27) మెరుపు ఇన్నింగ్స్‌తో శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆచితూచి ఆడాడు. 41 బంతులు ఎదుర్కొని 42 పరుగులు మాత్రమే చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
మిగతా వాళ్లలో డారిల్ మిచెల్(22) ఫర్వాలేదనిపించగా.. మొయిన్ అలీ(10), శివం దూబే(18), రవీంద్ర జడేజా(5) విఫలమయ్యారు. ఏడో స్థానంలో వచ్చిన సమీర్ రజ్వీ ధనాధన్ ఇన్నింగ్స్(8 బంతుల్లో 15)తో చెన్నై సూపర్ కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.
సొంతమైదానంలో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన చెన్నై ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు వెళ్లింది. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన సిమర్‌జీత్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment