న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ ముగిసింది. మిత్రపక్షాలతో కలిసి సుధీర్ఘ చర్చలు జరిపిన అనంతరం.. ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి తీర్మానం చేసుకుంది. బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా ఇండియా భాగస్వామ్యం ఏకతాటిపై పోరాటం చేస్తాయని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్షానికి మద్దతిచ్చిన దేశ ప్రజలందరికీ కూటమి తరపున ధన్యవాదాలు తెలిపారు.
లోక్‌సభ ఫలితాల అనంతరం ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశమైన సంగతి తెలిసిందే. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, డీ రాజా, ఏచూరి హాజరయ్యారు.
ఇండియా కూటమి సంయుక్త ప్రకటన
- నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం
- బీజేపీని గద్దె దింపేందుకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాం
ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ఈ ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయి. నైతికంగా ప్రధాని ఓడిపోయారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో కూటమి ఐక్యంగా పోరాడింది. రాజ్యాంగ విలువలను కాపాడాలనుకునే ఏ పార్టీ అయినా కూటమిలోకి రావొచ్చు. ఈ ఫలితాలు తనకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ.. మోదీ ప్రజల అభీష్టాన్ని మార్చాలని చూస్తున్నారు.
:::ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
#WATCH | Delhi: Congress president Mallikarjun Kharge says "...The INDIA bloc will continue will fight against the fascist rule of the BJP led by PM Modi. We will take the appropriate steps at the appropriate time to realise the people's desire not to be ruled by the BJP's… pic.twitter.com/NhdnHYbbfI
— ANI (@ANI) June 5, 2024
ప్రతిపక్ష నేతలంతా కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్(272) దాటకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కసరత్తు లేదా ప్రతిపక్ష హోదా కొనసాగింపు వంటి వివిధ అంశాలపై లోతుగా చర్చించారు. చివరికి ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి నిర్ణయించింది.
కాగా జూన్ 4న వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమికి 291, ఇండియా కూటమికి 232 స్థానాలు దక్కాయి. బీజేపీ స్వతహాగా 240 సీట్లు గెలుచుకుంది. అయితే ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో ప్రధాని మోదీ ఎన్డీయే మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రధాని పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతికి సమర్పించారు. జేడీయూ, టీడీపీ వంటి మిత్ర పక్షాలతో కలిసి జూన్ 8న మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment