ఏపీ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు.. ఇక సులభంగా మ్యుటేషన్లు | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు.. ఇక సులభంగా మ్యుటేషన్లు

Published Mon, Apr 18 2022 3:37 AM

New guidelines on easy mutations in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: భూ యాజమాన్య హక్కులకు సంబంధించి మ్యుటేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు పలు అంశాలపై కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు స్పష్టతనిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) సాయిప్రసాద్‌ ఆదేశాలు ఇచ్చారు. 

ముందే సబ్‌ డివిజన్‌ తప్పనిసరి
మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వారు దానికి ముందే సర్వే నెంబర్‌ను సబ్‌ డివిజన్‌ చేసుకోవడాన్ని తప్పనిసరి చేశారు. సబ్‌ డివిజన్‌ ప్రక్రియ పూర్తై రికార్డుల్లో సర్వే నెంబర్లు, పేర్లన్నీ ఆ ప్రకారం ఉన్నట్లు నిర్థారించుకున్న తర్వాతే మ్యుటేషన్‌ ప్రక్రియ ప్రారంభించాలని తహశీల్దార్లకు సూచించారు. పాస్‌బుక్‌ల జారీ కూడా మ్యుటేషన్‌ సమయంలోనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. మ్యుటేషన్‌తోపాటు పాస్‌బుక్‌ కోసం దరఖాస్తు స్వీకరించి రెండింటినీ ఒకేసారి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 

ప్రభుత్వ భూములపై..
ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యుటేషన్‌ చేయరాదని సూచించారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో చేయాల్సి వచ్చినప్పుడు ఆ బాధ్యతను పూర్తిగా జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించారు. అది కూడా కలెక్టర్ల నుంచి వచ్చిన ఫైలు ఆధారంగా చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తహశీల్దార్లకు ఉన్న ఈ అధికారాన్ని జేసీలకు బదలాయించారు. వారసత్వ వివాదాలకు సంబంధించి మ్యుటేషన్ల విషయంలో ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను తహశీల్దార్‌ అదే సమయంలో ఇవ్వాలని నిర్దేశించారు. మ్యుటేషన్‌ చేసుకునే సమయంలోనే ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను దరఖాస్తుదారుడు ఇచ్చినప్పుడు మళ్లీ ఆ కుటుంబం గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

చుక్కల భూములు, అసైన్డ్‌ మ్యుటేషన్‌పై స్పష్టత 
చుక్కల భూముల చట్టం వచ్చే నాటికి 12 సంవత్సరాలు దాటి సంబంధిత భూములు దరఖాస్తు చేసుకున్న వారి స్వాధీనంలోనే ఉన్నట్లు రికార్డుల ప్రకారం నిర్థారణ అయితే వాటికి మ్యుటేషన్‌ చేయవచ్చని సూచించారు. తీర్పులు వెలువడిన కేసులు, కోర్టు ద్వారా వేలం పాట నిర్వహించిన ఆస్తులను కొనుగోలు చేసిన వారికి వెంటనే యాజమాన్య హక్కులు కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. అసైన్డ్‌ భూములకు సంబంధించి రికార్డుల్లో ఉన్న వ్యక్తులే మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే చేయాలని, మూడో వ్యక్తి ఎవరైనా దరఖాస్తు చేస్తే తిరస్కరించాలని స్పష్టం చేశారు.

భూముల రీ సర్వే పూర్తయిన చోట సర్వే పూర్తయినట్లు జారీ చేసే 13 నోటిఫికేషన్‌ ఇవ్వడానికి ముందే అప్పటివరకు ఉన్న మ్యుటేషన్‌ దరఖాస్తులను క్లియర్‌ చేయాలని నిర్దేశించారు. మ్యుటేషన్‌ దరఖాస్తులను చిన్న కారణాలతో తిరస్కరించకూడదని, ఎందుకు తిరస్కరించారో స్పష్టమైన కారణాలు చూపాలని, ఇంకా ఏ డాక్యుమెంట్లు కావాలో స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. మ్యుటేషన్‌ కోసం వచ్చే దరఖాస్తుల్లో 45 శాతం తిరస్కారానికి గురవుతుండడంతో పలు అంశాలపై స్పష్టత ఇస్తూ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement