అసలే ఉద్యోగాలు దొరక్క యువత అల్లాడిపోతుంటే.. ఐటీ కంపెనీలు కూడా ఉద్యోగాలు కల్పించడంలో జాప్యం చేస్తున్నాయి. భారతదేశంలోని ఐటీ దిగ్గజాలు సైతం ఫ్రెషర్‌లను ఉద్యోగంలో చేర్చుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) పేర్కొంది.
గత రెండేళ్ల కాలంలో ఐటీ కంపెనీలు సుమారు 10,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్‌లకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్ఐటీఈఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో మొదలైన కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేసి.. ఉద్యోగంలో చేర్చుకోవడంలో చాలా ఆలస్యం చూపిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని.. ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు.
ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో ఏర్పడిన వ్యాపార అనిశ్చితి కారణంగా ఫ్రెషర్‌లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో జాప్యం జరుగుతుందని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. వ్యాపార అవసరాలను బట్టి ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకోవడం జరుగుతుందని, ఉద్యోగంలో చేర్చుకోవాలనుకున్నప్పుడు వారికి ముందుగానే సమాచారం తెలియాజేస్తామని ఇన్ఫోసిస్ మెయిల్స్ పంపినట్లు సమాచారం.
విప్రో కూడా రెండేళ్ల క్రితం అభ్యర్థులకు అందించిన క్యాంపస్ ఆఫర్‌లను ఆన్‌బోర్డ్ చేయలేదు. గత సంవత్సరం ముందు, మేము క్యాంపస్‌కి వెళ్లి చాలా ఆఫర్‌లు చేసాము. వారందరిని ఇంకా ఉద్యోగాల్లో చేర్చుకోలేదు. వారిని ఉద్యోగాల్లో చేర్చుకున్న తరువాత కొత్త ఫ్రెషర్‌లను తీసుకుంటామని విప్రో సిహెచ్‌ఆర్‌ఓ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు.
తగ్గిన ఐటీ ఉద్యోగుల సంఖ్య
భారతదేశంలో కరోనా మహమ్మారి తరువాత చాలామంది ఐటీ ఉద్యోగులు, తమ ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా ప్రభావం తగ్గినా తరువాత కూడా కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే వచ్చాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు విడుదల చేసిన డేటా ప్రకారం.. 20236-24 ఆర్ధిక సంవత్సరంలో 63759 మంది ఉద్యోగులు తగ్గిపోయారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment