మహబూబాబాద్, సాక్షి: జిల్లాలో శుక్రవారం వేకువ జామున ఘోర ప్రమాదం సంభవించింది. గూడూరు మండల కేంద్రంలో లారీ బోల్తా పడిన ఘనటలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
శుక్రవారం వేకువ ఝామున గూడూరు మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బస్సు కోసం కొందరు ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో మహబూబాబాద్ నుండి నర్సంపేటకు వెళ్తున్న వెదురు బొంగుల లారీ అదుపుతప్పి ప్రయాణికుల మీద పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్ని స్థానిక సీఐ గన్‌మెన్ పాపారావు, గవర్నమెంట్ టీచర్ దేవేందర్‌గా గుర్తించారు. విధులకు హాజరయ్యేందుకు వెళ్తూ వీళ్లిద్దరూ మృత్యువాత పడడం గమనార్హం.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బోల్తా పడ్డ లారీని లేపడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆపై మృతదేహాలను వెలికి తీసి గూడూరు మార్చురీకి తరలించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment