చెట్టును ఢీకొన్న కారు | Two People Died And Five Members Injured In Road Accident Today In Bhuvanagiri, More Details Inside | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న కారు

Published Thu, Dec 26 2024 9:35 AM | Last Updated on Thu, Dec 26 2024 10:30 AM

Two people die in road accident

ఇద్దరు నగర వాసుల దుర్మరణం  

మరో ఐదుగురికి గాయాలు 

భువనగిరి పట్టణంలో రోడ్డు ప్రమాదం   

భువనగిరిటౌన్‌: స్నేహితులంతా కలిసి యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చి వెళ్తుండగా.. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భువనగిరి పట్టణంలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 

హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో వివిధ కాలనీలకు చెందిన అర్జున్, శ్రీరాం మితిన్, శ్రీను, సుంకరి మణిజయంత్, యశ్వంత్‌ (17) స్నేహితులు. వీరంతా బుధవారం తెల్లవారుజామున అదే ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ సూఫియాన్‌ అలియాస్‌ రహీం (27) ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని అతడితో పాటు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు బయల్దేరారు. అదే కారులో అబ్దుల్‌ సూఫియాన్‌ బంధువు షాకీబ్‌ కూడా ఉన్నాడు. ఉదయం 7 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుని స్వామివారి దర్శనం పూర్తిచేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయణమయ్యారు. 

ఈ క్రమంలో యాదగిరిగుట్ట–భువనగిరి మధ్యలో ఓ హోటల్‌ వద్ద కారును ఆపి టిఫిన్‌ చేశారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌లో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు బయల్దేరారు. మార్గమధ్యలో భువనగిరి పట్టణంలోని టీచర్స్‌ కాలనీ సమీపంలో వరంగల్‌–హైదరాబాద్‌ జాతీయ రహదారి బైపాస్‌ వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన రెయిలింగ్‌ను ఢీకొని అక్కడే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్‌ చేస్తున్న అబ్దుల్‌ సూఫియాన్‌తో పాటు వెనుక కూర్చున్న యశ్వంత్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఐదుగురికి గాయాలయ్యాయి. 

భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలింపు.. 
సమాచారం తెలుసుకున్న భువనగిరి పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఐదుగురిని 108 వాహనంలో భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. షాకీబ్‌తో పాటు మితిన్, మణిజయంత్‌కు తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం వాహనంలో ఇరుక్కుపోయిన సూఫియాన్, యశ్వంత్‌ మృతదేహాలను పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.  

సెలవు రోజు కావడంతో..  
అర్జున్, యశ్వంత్, మణిజయంత్, శ్రీరాం మితిన్, శ్రీను హైదరాబాద్‌లోనే వివిధ ప్రాంతాలలో ఇంటరీ్మడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. శ్రీను, అర్జున్, మితిన్‌ శ్రీచైతన్య జూనియర్‌ కళాశాలలో, యశ్వంత్‌ నారాయణగూడలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో, మణిజయంత్‌ నల్లకుంటలోని నారాయణ జూనియర్‌ కళాశాలలో చదువుకుంటున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా కళాశాలకు రెండు రోజులు సెలవులు ఇవ్వడంతో స్నేహితులంతా కలిసి యాదగిరిగుట్టకు వచ్చారు. మృతుల కుటుంబ సభ్యులు భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ ఎస్‌ఐ కుమారస్వామి తెలిపారు.

శాంతినగర్‌లో విషాద ఛాయలు 
రామంతాపూర్‌: తమ ఒక్కగానొక్క కుమారుడు యశ్వంత్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామంతాపూర్‌ శాంతినగర్‌కు చెందిన శ్రీనివాస్, మాధవి దంపతుల దుఃఖ సాగరంలో మునిగిపోయారు. 

కుమారుడి మరణ వార్త తెలియగానే 
శ్రీనివాస్‌ దంపతులు భువనగిరి జిల్లా ఆస్పత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. సోదరుడి మరణంతో యశ్వంత్‌ సోదరీమణులు భవ్య, సమీక్ష భోరున 
విలపిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement