గచ్చిబౌలి: ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్..మితిమీరిన వేగం కారణంగా బీటెక్ విద్యార్థిని దుర్మరణం పాలైంది. మరో యువకుడు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపిన ప్రకారం..కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన నర్సయ్య, పూజ దంపతుల రెండో కుమార్తె ఐరేని శివాని(21) గండిపేట్‌లోని సీబీఐటీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతోంది. గండిపేట్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. నిజాంసాగర్‌లోని నవోదయ స్కూల్ 10వ తరగతి విద్యార్థుల పూర్వ సమ్మేళనం కోసం ఈ నెల 22న ఉదయం 4.30 గంటలకు హాస్టల్ నుంచి బయలుదేరింది.
తిరిగి రాత్రి 12 గంటలకు కూకట్‌పల్లిలో బస్సు దిగి హాస్టల్‌కు వెళ్లేందుకు తన స్నేహితుడైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వెంకట్‌రెడ్డిని పిలిచింది. ఇద్దరు కలిసి డిన్నర్ చేసి హాస్టల్‌కు బయలుదేరారు. రాత్రి 1.30 గంటల సమయంలో నానక్‌రాంగూడ రోటరీ నుంచి నార్సింగ్ సర్వీస్ రోడ్డులో బైకుపై వెళ్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచి్చన స్కోడా కారు వీరి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో శివాని, వెంకట్‌రెడ్డి ఎగిరి కిందపడ్డారు.
తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరిని 108 అంబులెన్స్‌లో కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శివాని మృతిచెందినట్లు అక్కడి డాక్టర్లు ధృవీకరించారు. తీవ్ర గాయాలతో ఉన్న వెంకట్‌రెడ్డిని మెరుగైన చికిత్స కోసం మదీనాగూడలోని ఓ హాస్పిటల్‌లో చేరి్పంచారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుని కుమారుడు శ్రీకాలేష్ (19) కారును అతి వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని తేలింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి, స్కోడా కారును స్వాదీనం చేసుకున్నారు.
బ్రీత్ ఎనలైజర్ చేయగా ఎలాంటి ఆల్కహాల్ తాగలేదని నిర్ధారణ అయిందని, అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. కొండాపూర్‌లో నివాసం ఉండే శ్రీకాలేష్ అమెరికా నుంచి వచ్చిన తన స్నేహితులను నార్సింగిలో డ్రాప్ చేసేందుకు కారులో బయలుదేరగా మార్గమధ్యలో ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురు బీటెక్ విద్యార్థుల అదృశ్యం
Comments
Please login to add a commentAdd a comment