కృష్ణా, సాక్షి: రోడ్డు ప్రమాదంతో వేకువ ఝామున జిల్లా రహదారి నెత్తురోడింది. శుక్రవారం ఉదయం కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రొయ్యల ఫీడ్‌తో వెళ్తున్న కంటెయినర్‌ను బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. మృతుల్లో ఐదుగురు కోనసీమ అంబేద్కర్ జిల్లా తాళ్లరేవుకు చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. వీళ్లంతా మునిపెడలో చేపల వేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో మృతదేహం కంటెయినర్ డ్రైవర్‌ది కాగా.. అతని పేరు, ఇతర వివరాలు తెలియరావాల్సి ఉంది.
ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రొయ్యల ఫీడ్‌తో పాండిచ్చేరి నుంచి భీమవరం ఆ కంటెయినర్ వెళ్తోంది. ఇక బొలెరో వ్యాన్ అమలాపురం మండలం తాళ్లరేవు నుంచి కృత్తివెన్ను మండలం మునిపెడ వెళ్తోంది. అయితే పుల్లల లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను బొలెరో డ్రైవర్ అతివేగంగా ఓవర్ టేక్ చేసే క్రమంలో కంటెయినర్‌కు ఢీ కొట్టినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించుకున్నారు.
పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి
కృష్ణా జిల్లా సీతనపల్లి ఘోర రోడ్డు ప్రమాద ఘటన పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆమె.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరారు. అలాగే ఘటన తర్వాత.. గాయపడిన వాళ్లను బయటకు తీసిన స్థానికుల చొరవకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment