kruthivennu
-
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
కృష్ణా, సాక్షి: రోడ్డు ప్రమాదంతో వేకువ ఝామున జిల్లా రహదారి నెత్తురోడింది. శుక్రవారం ఉదయం కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రొయ్యల ఫీడ్‌తో వెళ్తున్న కంటెయినర్‌ను బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. మృతుల్లో ఐదుగురు కోనసీమ అంబేద్కర్ జిల్లా తాళ్లరేవుకు చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. వీళ్లంతా మునిపెడలో చేపల వేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో మృతదేహం కంటెయినర్ డ్రైవర్‌ది కాగా.. అతని పేరు, ఇతర వివరాలు తెలియరావాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రొయ్యల ఫీడ్‌తో పాండిచ్చేరి నుంచి భీమవరం ఆ కంటెయినర్ వెళ్తోంది. ఇక బొలెరో వ్యాన్ అమలాపురం మండలం తాళ్లరేవు నుంచి కృత్తివెన్ను మండలం మునిపెడ వెళ్తోంది. అయితే పుల్లల లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను బొలెరో డ్రైవర్ అతివేగంగా ఓవర్ టేక్ చేసే క్రమంలో కంటెయినర్‌కు ఢీ కొట్టినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించుకున్నారు.పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతికృష్ణా జిల్లా సీతనపల్లి ఘోర రోడ్డు ప్రమాద ఘటన పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆమె.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరారు. అలాగే ఘటన తర్వాత.. గాయపడిన వాళ్లను బయటకు తీసిన స్థానికుల చొరవకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
పాము కాటుకు పురోహితుడు బలి.. రెండుసార్లు కాటువేసినా చంపకుండా..
కృత్తివెను (కృష్ణా జిల్లా): పాము కాటుకు పురోహితుడు బలైన ఘటన కృత్తివెన్ను పంచాయతీ గుడిదిబ్బ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొండూరి నాగబాబు (48) పౌరోహిత్యం, వాస్తుశాస్త్రం చెబుతూ జీవనం సాగిస్తారు. శనివారం మధ్యాహ్నం పీతలావ గ్రామంలోని ఓ రొయ్యల మేత షెడ్డులో పాము ఉందన్న స్థానికుల సమాచారంతో నాగబాబు వెళ్లాడు. తాచుపామును పట్టుకున్న వెంటనే ఆయన చేతిపై రెండుమార్లు కాటు వేసింది. అయినప్పటికీ పామును విడిచిపెట్టకుండా సురక్షిత ప్రాంతంలో వదిలేశాడు. తరువాత తనకు తెలిసిన సొంత వైద్యం చేసుకుని వెంటనే మచిలీపట్నంలోని హాస్పిటల్‌కు వెళ్లగా అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచాడు. ఆదివారం ఆయన మృతదేహాన్ని వేలాది మంది సందర్శించారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. పాము కాటు వేసినా కానీ దానికి ఎటువంటి హాని చేయకుండా సురక్షిత ప్రదేశంలో విడిచిపెట్టడం ఆయనకు మూగజీవాలపై ఉన్న ప్రేమను తెలియజేస్తుందని ప్రజలు చర్చించుకున్నారు. నాగబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాగబాబు తండ్రి కొండూరి గోపాలకృష్ణ శాస్త్రి ఎన్నో ఏళ్లుగా పౌరోహిత్యం చేసుకుంటూ, పాము, తేలు కాటుకు నాటు వైద్యం చేసేవారు. ఎవరి దగ్గర ఎటువంటి డబ్బులు తీసుకోకుండా వీరు పాముకాటుకు విరుగుడు వేస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. శాస్త్రి మరణం తరువాత ఆయన పెద్ద కుమారుడు నాగబాబు పాముకాటుకు మంత్రం వేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో ఆయన పాముకాటుకు గురై మృతి చెందడం గ్రామంలో విషాదం నింపింది. చదవండి: (మంత్రి విశ్వరూప్‌కు సీఎం జగన్ పరామర్శ) -
పడవ బోల్తా : ప్రయాణికులు సురక్షితం
విజయవాడ : కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలోని ఉప్పుటేరులో మంగళవారం పడవ బోల్తా పడింది. పడవలో ప్రయాణిస్తున్న 50 మంది నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఉప్పుటేరులోని పడిన ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. పల్లెపాడు నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని పాతపాడులో జరుగుతున్న సంతకు వీరు చేపల్ని తీసుకువెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు.