ప్రముఖ నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్, ఆయన అనుచరులు రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశారనే కేసులో అరెస్టులు పెరుగుతున్నాయి. క్రమంగా మరింతమంది పాత్ర బయటపడుతోంది. పోలీసులు తాజాగా ప్రదోశ్ అనే నటున్ని అరెస్టు చేశారు. దీంతో అరైస్టెన నిందితుల సంఖ్య 14కు చేరింది. ప్రదోశ్ పలు కన్నడ చిత్రాలలో సహాయక నటునిగా నటించాడు. దర్శన్‌తో కలిసి బృందావన, బుల్ బుల్ సినిమాలలో నటించాడు. దర్శన్ గ్యాంగ్‌లో ప్రదోశ్ ఒకడిగా పేరుంది.
గతంలో ఓ బీజేపీ మంత్రి వద్ద పని చేశాడు, ఆ పార్టీ ఐటీ విభాగంలోనూ ముఖ్యునిగా ఉండేవాడు. రేణుకాచార్య హత్య తరువాత దర్శన్ ప్రదోశ్‌కు రూ.30 లక్షలు ఇచ్చి సెటిల్ చేయమని సూచించాడు. ఈ కేసులో ఇంకా ముగ్గురు నిందితులు జగదీష్, రవి, రాజు ఉన్నారని, పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా, రేణుకాచార్య మృతదేహానికి బౌరింగ్ ఆస్పత్రిలో జరిపిన పోస్టుమార్టంలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అతనికి ప్రైవేటు భాగాల్లో తీవ్రంగా హింసించారని, శరీరంలో అనేకచోట్ల గాయాలై ఎముకలు విరిగి ఉన్నాయని తెలిపారు.
ఠాణా చుట్టూ నిషేధాజ్ఞలు
దర్శన్, పవిత్రగౌడ, ఇతర నిందితులను అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్‌స్టేషన్‌లో కస్టడీలో ఉంచిన సంగతి తెలిసిందే. దీంతో దర్శన్ అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో వారిని అదుపుచేయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అందుకే పోలీస్ స్టేషన్‌ను షామియానాతో మూసివేసి భద్రత పెంచారు. స్టేషన్ కాంపౌండ్‌ను పరదాలతో కప్పేసారు. సామాన్య ప్రజలను ఎంతో అవసరమైతే కానీ లోపలకు అనుమతించడం లేదు. లోపల ఎవరూ ఫోటోలు, వీడియోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చుట్టూ 144 నిషేధాజ్ఞలు, అలాగే 200 మీటర్ల చుట్టూ కర్ఫ్యూ విధించారు. ఈ నెల 17 వరకు ఇవి అమలులో ఉంటాయి.
బాడీ తరలించిన స్కార్పియో సీజ్
కామాక్షిపాళ్యలోని పట్టణగెరెలో షెడ్ నుంచి రేణుకాస్వామి మృతదేహాన్ని తరలించడానికి వాడిన స్కార్పియో కారుని కామాక్షిపాళ్య పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌ఆర్ నగర దర్శన్ అభిమానుల సంఘం అధ్యక్షుని ఇంటి వద్ద ఈ వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఈ వాహనం పునీత్ అనే వ్యక్తి పేరుమీద రిజిస్టర్ అయ్యింది. షెడ్ నుండి శవాన్ని తరలించడానికి సహాయపడిన గ్యారేజ్ మంజు కోసం పోలీసులు వెతుకుతున్నారు.
భార్య ఇన్‌స్టా ఖాతా డిలిట్
దర్శన్ భార్య విజయలక్ష్మి తన ఇన్‌స్టా ఖాతాను క్లోజ్ చేసి డిలిట్ చేశారు. దర్శన్ అరెస్టు కాగానే భర్తను ఇన్‌స్టా లో అన్‌ఫాలో చేశారు. ఇప్పుడు దర్శన్‌కు మద్దతుగా, వ్యతిరేకంగా వస్తున్న కామెంట్లు, పోస్టులతో ఏకంగా ఇన్‌స్టా నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. విజయలక్ష్మికి ముందునుంచి భర్తతో గొడవలు ఉండడం తెలిసిందే. ఈ కేసులతో విడాకులు తీసుకోవచ్చని సమాచారం.
దర్శన్‌ను సస్పెండ్ చేయలేదు
హత్య కేసులో అరైస్టెన దర్శన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అందరితో చర్చించి చర్యలు తీసుకుంటామని కన్నడ సినిమా వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎన్‌ఎం సురేశ్ తెలిపారు. కన్నడ ఆర్టిస్టుల సంఘం,వాణిజ్య మండలి, ఇతర సినీ పెద్దలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని, దర్శన్‌ను కన్నడ చిత్ర రంగం నుంచి సస్పెండ్ చేశారనే వార్త అవాస్తవమన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, వాణిజ్య మండలి ఎవరి తరఫున మాట్లాడదని అన్నారు. దర్శన్‌పై ఆరోపణ మాత్రమే ఉందని, కోర్టులో తీర్పు తరువాతే ఆయన నేరం చేశాడా, కాదా అనేది తెలుస్తుందన్నారు. మరోవైపు దర్శన్‌కు వ్యతిరేకంగా మండ్య సహా పలు ప్రాంతాల్లో భారీ నిరసనలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment