చిత్రదుర్గం రేణుకాస్వామి హత్య కేసులో బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్న నటుడు దర్శన్‌ని చూడాలని ఓ మహిళ అక్కడ హంగామా చేసింది. తాజాగా జైలు వద్దకు కలబుర్గికి చెందిన లక్ష్మీ అనే యువతి అక్కడకు వచ్చింది. తాను దర్శన్‌ను చూడాలని, జైల్లోకి వదలాలని సిబ్బందిని పట్టుబట్టింది. పోలీసులు అడ్డుచెప్పడంతో వారితో వాగ్వాదానికి దిగింది. దర్శన్ కుటుంబ సభ్యులు మాత్రమే కలవడానికి అనుమతి ఉందని ఆమెకు తెలిపారు.
అయితే, తాను దర్శన్‌ని పెళ్లి చేసుకుంటానని, అప్పుడు కలవడానికి ఒప్పుకుంటారా..? అని ప్రశ్నించింది. దీంతో కంగుతిన్న పోలీసు అధికారులు ఆమెను జైలు నుంచి పంపించే ప్రయత్నం చేశారు. తాను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వద్దకు కూడా వెళ్లి వచ్చానని అక్కడ కూడా దర్శన్‌ను కలిసేందుకు అవకాశం దొరకలేదని రాద్దాంతం చేసింది. చివరికి పోలీసులు ఆమెకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
కన్నడ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గ వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో నటుడు దర్శన్, పవిత్రగౌడ, మరో 15 మంది పాత్ర ఉందంటూ ధృవీకరిస్తూ పోలీసులు 3,991 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులు దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 నిందితురాలిగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పవిత్రగౌడను అసభ్యంగా కామెంట్లు చేస్తున్నాడని రేణుకాస్వామిని కిరాతకంగా దర్శన్ అనుచరులు హతమార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment