
కర్ణాటకలో రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ ఆలయాల బాట పడ్డాడు. జిల్లాలోని శ్రీరంగపట్టణ తాలూకా ఆరతి ఉక్కడలో వెలిసిన శ్రీ అహల్యదేవి మారెమ్మ దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని పూజలు చేశారు. విజయలక్ష్మి, కుమారునితో కలిసి ఆలయానికి వచ్చారు. మేలుకోటె ఎమ్మెల్యే దర్శన్ పుట్టణ్ణయ్యతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఇప్పటికే బళ్లారి జిల్లా కురుగోడిలోని బసవేశ్వర ఆలయంలో కూడా ఆయన పూజలు నిర్వహించారు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆయన నిత్యం ఏదో గుడికి వెళ్తూ కనిపిస్తూ ఉండటంతో ఆయనలో భక్తి చింతన ఎక్కువగా కనిపిస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
కన్నడలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్, పవిత్రగౌడ సుమారు ఆరు నెలలు పాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 అని పోలీసులు పేర్కొన్నారు. అయితే, దర్శన్ జైల్లో ఉన్నప్పుడు నిద్రలేని రాత్రులు గడిపినట్లు కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి.
బళ్లారి జైలులో దర్శన్ పలు ఇబ్బందులు పడినట్లు తెలిసిందే. అక్కడ కొన్ని రోజుల పాటు ఆయన సరైన నిద్రలేకుండా గడిపారని సమాచారం. దీనంతటికి కారణం రేణుకాస్వామి.. అతని ఆత్మ వెంటాడుతోందని జైలు అధికారులతో దర్శన్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నిద్రపోతున్న సమయంలో రేణుకాస్వామి ఆత్మ కలలోకి వచ్చి బయపెడుతుందని ఆయన చెప్పుకొచ్చినట్లు తెలిసింది.
దీంతో జైలు బారికేడ్‌లో తాను ఒంటరిగా ఉండలేకపోతున్నట్లు అధికారులతో చెప్పారని వార్తలు వైరల్ అయ్యాయి. అర్ధరాత్రి సమయంలో నిద్రలోనే దర్శన్ కేకలు పెడుతున్నట్లు తోటి ఖైదీలు చెప్పినట్లు తెలిసింది. అయితే, ఈ విషయం గురించి అప్పట్లో జైలు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
దర్శన్ బెయిల్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత జైలు జీవితం తనను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కూడా రేణుకాస్వామి ఆత్మ తనను ఇబ్బంది పెడుతుందని, అందుకే ఆయన పలు గుడుల చుట్టూ తిరుగుతున్నారని ప్రచారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment