హత్యకు ముందు రేణుకాస్వామి పరిస్థితి.. ఫోటోలు వైరల్‌ | Renukaswamy Last Moments Photos Goes Viral | Sakshi
Sakshi News home page

హత్యకు ముందు రేణుకాస్వామి పరిస్థితి.. ఫోటోలు వైరల్‌

Published Thu, Sep 5 2024 3:16 PM | Last Updated on Thu, Sep 5 2024 3:49 PM

Renukaswamy Last Moments Photos Goes Viral

కన్నడ సినీ నటుడు దర్శన్‌ అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో తాజాగా కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. హత్యకు ముందు అతనిపై తీవ్రంగా దాడిచేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఈ ఫోటోలు తీసినట్లు సమాచారం. వైరల్‌ అవుతున్న ఫోటోలను చూస్తుంటే ఒక లారీ ముందు రేణుకాస్వామిని కూర్చోబెట్టినట్లు అర్థమవుతుంది. దుస్తులు లేకుండాే ఆయన ఏడుస్తున్నట్లు ఫోటోలో కనిపిస్తుంది. ఆయన చేతిపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి.

రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడిగా ఉన్న ప్రదోశ్‌ మొబైల్‌ఫోన్‌ నుంచి ఫోటోలు, వీడియోలు పోలీసులు సేకరించారు. నన్ను కొట్టొద్దు అంటూ రేణుకాస్వామివారిని వేడుకున్నట్లు పలు వీడియోల్లో కనబడింది. ఆర్‌ ఆర్‌ నగరలోని పట్టణగెరె షెడ్‌లో సీసీ కెమెరా చిత్రాల్లో దర్శన్‌ ఉండడం, పవిత్రాగౌడ పాదరక్షలకు ఉన్న రక్తపు మరకలను సాక్ష్యాలుగా పేర్కొన్నారు. రేణుకాస్వామిని షెడ్‌ కు తీసుకువచ్చాం అని ఇతర నిందితులు దర్శన్‌ మొబైల్‌కి మెసేజ్‌ చేయగా, పోలీసులు దానిని సేకరించారు. నగరంలోనే ఓ పబ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న దర్శన్‌ నేరుగా షెడ్‌ కు వెళ్లి రేణుకాస్వామిని చితకబాదినట్లు తెలిపారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారడానికి ఓ నిందితుడు ఒప్పుకున్నట్లు చార్జిషీట్‌లో పొందుపరిచారు. ఈ కేసు దర్యాప్తును పశ్చిమ విభాగం డీసీపీ ఎస్‌.గిరీశ్‌, ఏసీపీ చందన్‌కుమార్‌ బృందం దర్యాప్తు చేసింది.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గంవాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో నటుడు దర్శన్‌, పవిత్రగౌడ, మరో 15 మంది పాత్రను ధృవీకరిస్తూ పోలీసులు 3,991 పేజీలతో కూడిన బృహత్‌ చార్జిషీట్‌ను తాజాగా  బెంగళూరు నగర 24 వ ఏసీఎంఎం కోర్టులో సమర్పించారు. దర్శన్‌ ఏ2 నిందితుని, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 నిందితురాలిగా పేర్కొన్నారు. పవిత్ర బెంగళూరు పరప్పన జైల్లో, దర్శన్‌బళ్లారి జైలులో రిమాండులో ఉన్నారు. హత్యకేసులో ఇప్పటివరకు దర్యాప్తులో సేకరించిన ప్రత్యక్ష, సాంకేతిక, ఇతరత్రా సాక్ష్యాధారాలను చార్జిషీటులో పొందుపరచినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ బీ దయానంద్‌ విలేకరులతో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement