బాబు డైరెక్షన్‌లోనే పీకే వ్యాఖ్యలు! | Sakshi
Sakshi News home page

బాబు డైరెక్షన్‌లోనే పీకే వ్యాఖ్యలు!

Published Tue, Mar 5 2024 6:25 AM

Prashant Kishore comments in direction of Chandrababu - Sakshi

శనివారం చంద్రబాబుతో మూడుగంటలు సమావేశం

బాబు చెప్పిన మేరకే ఆదివారం పీకే వైఎస్సార్‌సీపీపై వ్యతిరేక వ్యాఖ్యలు

ఏ సర్వేలు చేయడంలేదంటూనే వైఎస్సార్‌సీపీపై విషం

బాబు మేలు కోరే ఇలా మాట్లాడారంటున్న విశ్లేషకులు

సోమవారమూ బాబుతో పీకే రెండున్నర గంటలపాటు భేటీ

ఆ భేటీ తర్వాతే అనంతపురం జిల్లా సభకు చంద్రబాబు

సాక్షి, హైదరాబాద్‌: గతంలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే) ఆదివారం హైదరాబాద్‌లోని ఓ సదస్సులో ఏపీలో వైఎస్సార్‌సీపీపై చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ప్రేరేపితమని బయటపడిపోయింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ముందుగా సమావేశమై, ఆయన డైరెక్షన్‌లోనే ప్రశాంత్‌ కిషోర్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తేటతెల్లమైంది. హైదరాబాద్‌ నగరంలోని ఖరీదైన హోటల్‌లో బస చేసి, గంటల తరబడి చంద్రబాబుతో భేటీలు జరుపుతున్న ప్రశాంత్‌ కిషోర్‌.. బాబు వ్యూహంలో భాగంగానే వైఎస్సార్‌సీపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఓ ఆంగ్ల పత్రిక సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌ శనివారం మూడు గంటలపాటు చంద్రబాబుతో సమావేశమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆ సమావేశంలో చంద్రబాబు కోరిన మేరకు ఆదివారం సదస్సులో ఏపీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. తాను సర్వేలు చేయడంలేదని, ఏ రాజకీయ పార్టీకీ సలహాలు ఇవ్వడంలేదంటూనే, పీకే ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఎలాంటి సర్వేలు చేయకుండా, గణాంకాల్లేకుండానే ఓ పార్టీ ఓడిపోతుందని చెప్పడం కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమేనని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రోజురోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం, టీడీపీ ఓటమి ఖాయమని తేలడంతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలన్న ఉద్దేశంతోనే పీకేతో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ వీరు వైసీపీపై ఇటువంటి విష ప్రచారాన్ని మరింతగా చేయాలని చంద్రబాబు, పీకే నిర్ణయించినట్లు చెబుతున్నారు.

సోమవారమూ బాబుతో పీకే భేటీ
సోమవారం ఉదయం కూడా ప్రశాంత్‌ కిషోర్‌ రెండున్నర గంటలపాటు చంద్రబాబుతో భేటీ అ­య్యా­రు. టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్‌ శర్మ (ఒకప్పుడు పీకే టీంలో సభ్యుడు), లోకేశ్‌ సన్నిహితుడు కిలారి రాజేష్‌ కూడా ఈ సమావేశంలో పా­ల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశం ముగిసేవరకు సోమవారం ఉదయం చంద్రబాబు మరెవరికి అపాయింట్‌మెంట్‌ కూ­డా ఇవ్వలేదని తెలిసింది. పీకేతో భేటీ తర్వాతే చంద్రబాబు అనంతపురం జిల్లాలో టీడీపీ సమావేశానికి వెళ్లారని సమాచారం. సోమవారం సాయంత్రం ప్రశాంత్‌ కిషోర్‌ పాట్నా వెళ్లినట్లు తెలిసింది.

Advertisement
Advertisement