మార్గదర్శి డిపాజిట్లు చట్ట విరుద్ధం | Sakshi
Sakshi News home page

మార్గదర్శి డిపాజిట్లు చట్ట విరుద్ధం

Published Wed, Feb 21 2024 12:45 AM

RBI Says Margadarsi deposits are illegal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మార్గదర్శి చిట్‌ ఫండ్‌ డిపాజిట్ల వ్యవహారంలో తాము ఎక్కడా చట్ట నిబంధనలను ఉల్లంఘించలేదంటూ ఇన్ని రోజులు బొంకుతూ వచ్చిన రామోజీరావుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గట్టిగా మొట్టికాయ వేసింది. రామోజీరావు నోరు మూయించేలా మంగళవారం సుప్రీంకోర్టు ముందు ఆర్బీఐ అసలు వాస్తవాన్ని బయటపెట్టింది. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) పేరు మీద డిపాజిట్లు సేకరించడం ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45ఎస్‌కు విరుద్ధమని నివేదించింది.

ఈ కేసులో మార్గదర్శి డిపాజిట్ల సేకరణ అలానే జరిగిందని, ఆర్‌బీఐ తరఫు న్యాయవాది రమేష్‌ బాబు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివరాల్లోని తీవ్రతను పరి­గణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, పూర్తి వివరా­లతో ఓ నోట్‌ను తమ ముందుంచాలని ఆర్‌బీఐని ఆదేశించింది. అలాగే ఏపీ ప్రభు­త్వం­తోపాటు పిటిషనర్‌ ఉండవల్లి అరుణ్‌­కుమార్‌ను సైతం మార్గదర్శి చిట్‌ఫండ్‌ డిపాజిట్ల సేకరణ విషయంలో నోట్‌ను తమ ముందుంచాలని ఆదేశిస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వు­లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా..

విభజనకు ఒక్క రోజు ముందు తీర్పు...
ఆర్‌బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.2,600 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించినందుకు గాను చట్ట ప్రకారం మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావును ప్రాసిక్యూట్‌ చేయాలంటూ 2008లో సీఐడీ అధీకృత అధికారి టి.కృష్ణరాజు నాంపల్లి మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో క్రిమినల్‌ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిని కొట్టేస్తూ ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒక్క రోజు ముందు (2018 డిసెంబర్‌ 31) అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజని (ప్రస్తుతం ఎన్‌సీఎల్‌టీ సభ్యురాలు, అమరావతి బెంచ్‌) తీర్పునిచ్చారు.

ఈ తీర్పును సవాలు చేస్తూ మార్గదర్శి అక్రమాలను వెలుగులోకి తెచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ 2019లో సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 2020లో ఇదే వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఉమ్మడి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2022లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై మంగళవారం జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. 

కోర్టు పరిధిలో ఉన్నా కూడా రూ.2వేల కోట్లు సేకరణ
ఈ సందర్భంగా మార్గదర్శి, రామోజీరావుల తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, వసూలు చేసిన డిపాజిట్లు చాలా వరకు వెనక్కు ఇచ్చేశామన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకునే ఉమ్మడి హైకోర్టు మార్గదర్శిపై సీఐడీ నమోదు చేసిన ఫిర్యాదును కొట్టేసిందన్నారు. అసలు ఈ కేసుతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, మార్గదర్శి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కూడా పిటిషన్‌ దాఖలు చేసిందని, ఇందుకు సుప్రీంకోర్టు గతంలోనే అనుమతి మంజూరు చేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యవహారం కోర్టుకు వచ్చే సమయానికి నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందని తెలిపారు. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కూడా మార్గదర్శి డిపాజిట్ల సేకరణను ఆపలేదని, అప్పుడు కూడా మరో రూ.2 వేల కోట్లు సేకరించిందని వివరించారు.

చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారా? లేదా? 
ఈ కేసులో పిటిషనర్‌ అయిన ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ పార్టీ ఇన్‌ పర్సన్‌ (కేసు దాఖలు చేసిన వ్యక్తి తన వాదనలను తానే వినిపించడం)గా వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో తానే ఫిర్యాదుదారుడినని తెలిపారు. తీసుకున్న డబ్బు వెనక్కు ఇచ్చేశారా? ఎవరు ఇచ్చారు.. ఎవరికి ఇచ్చారు..? అన్న విషయాలు ముఖ్యం కాదన్నారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా? అన్నదే ఇక్కడ చూడాల్సిన అంశమని తెలిపారు. హెచ్‌యూఎఫ్‌గా ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45ఎస్‌కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించింది నిజమో కాదో తేల్చాలని ఆయన కోర్టును కోరారు.

ఆర్‌బీఐ తరఫు న్యాయవాది కూడా ఇక్కడే ఉన్నారని, ఆయన్ను అడిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. దీంతో ఆర్‌బీఐ తరఫు న్యాయవాది ఎంఆర్‌ రమేష్‌ బాబు స్పందిస్తూ, హెచ్‌యూఎఫ్‌గా సెక్షన్‌ 45ఎస్‌ ప్రకారం డిపాజిట్లు సేకరించడం ఆర్‌బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధమని కోర్టుకు నివేదించారు. ఈ కేసులో కూడా ఇలాగే డిపాజిట్ల సేకరణ జరిగిందని తేల్చి చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ఇలా 45ఎస్‌కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన విషయాన్ని హైకోర్టుకు చెప్పారా? అని ప్రశ్నించింది. హైకోర్టులో మార్గదర్శి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో తాము ప్రతివాది కానందున ఈ విషయాలను హైకోర్టు ముందుంచలేదన్నారు.

సుప్రీంకోర్టులో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చారని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న విస్తృత ధర్మాసనం, అన్నీ వివరాలను నాలుగు పేజీల నోట్‌ ద్వారా తమ ముందుంచాలని ఇరుపక్షాలను ఆదేశించింది. ఆ వివరాల ఆధారంగా పూర్తి స్థాయి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. వాదనలు వినిపించేందుకు అందరికీ అవకాశం ఇస్తామంది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది. ఈ విచారణకు మార్గదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌ సాల్వే, సిద్దార్థ లూత్రా, ఉండవల్లి తరఫున న్యాయవాదులు అల్లంకి రమేష్, అరుణా గుప్తాలు హాజరయ్యారు.

ఇదీ మార్గదర్శి బాగోతం
హిందూ అవిభక్త కుటుంబం పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సాధారణ ప్రజానీకం నుంచి ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌)కు విరుద్ధంగా రూ.2,600 కోట్లు సేకరించిందనే విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్ని ఆధారాలతో ఆర్‌బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి తగిన స్పందన లేకపోవడంతో చట్ట ప్రకారం తమ ముందున్న ఆధారాల ఆధారంగా మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్గదర్శి ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు ఎన్‌.రంగాచారిని నియమిస్తూ 2006లో జీవో 800 జారీ చేసింది.

ఇదే సమయంలో సీఐడీ తరఫున సంబంధిత కోర్టుల్లో పిటిషన్లు, దరఖాస్తులు దాఖలు చేసేందుకు అధీకృత అధికారిగా టి.కృష్ణరాజును నియమిస్తూ జీవో 801 జారీ చేసింది. ఈ రెండు జీవోలపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించగా, జీవోలపై స్టే చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమాలపై విచారణ జరిపిన రంగాచారి 2007 ఫిబ్రవరిలో నివేదిక సమర్పించారు. రికార్డుల తనిఖీకి మార్గదర్శి ఏ మాత్రం సహకరించలేదని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ భారీ నష్టాల్లో ఉందని, మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్లు తిరిగి చెల్లించే పరిస్థితిలో ఆ సంస్థ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ నిధులను ఇతర అనుబంధ కంపెనీలకు మళ్లించడమే ఈ పరిస్థితికి కారణమని ఆయన వివరించారు.

మార్గదర్శి చట్ట ఉల్లంఘనలపై అధీకృత అధికారి ఫిర్యాదు 
మార్గదర్శి అక్రమాలు, చట్ట ఉల్లంఘనలపై అధీకృత అధికారి కృష్ణరాజు 2008 జనవరిలో నాంపల్లి మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో క్రిమినల్‌ ఫిర్యాదు (సీసీ నెంబర్‌ 540) దాఖలు చేశారు. దీనిని కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి సీసీ 540లో తదుపరి చర్యలను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేయగా, సీసీ 540లో తదుపరి చర్యలు కొనసాగించుకునేందుకు అనుమతించింది. ఆ తర్వాత ఇదే సీసీ 540పై మార్గదర్శి మరో రూపంలో పిటిషన్‌ దాఖలు చేయడం ద్వారా హైకోర్టు సానుకూల స్టే ఉత్తర్వులిచ్చింది. 

ఏకంగా ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టు 
2011లో తిరిగి సీసీ 540ని కొట్టేయాలంటూ సీఆర్‌పీసీ సెక్షన్‌ 482 కింద మార్గదర్శి పిటిషన్‌ దాఖలు చేసింది. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌) కింద తామెలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అందువల్ల క్రిమినల్‌ ఫిర్యాదును కొట్టేయాలని కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదైనా కేసులో స్టే కాల పరిమితి ఆరు నెలలు కావడంతో, హైకోర్టు ఇచ్చిన స్టే గడువు ముగిసింది. స్టే గడువు పెంపు కోసం మార్గదర్శి 2018లో పిటిషన్‌ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదిలా ఉండగా, సీసీ 540ని కొట్టేయాలంటూ మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు.

ఉమ్మడి హైకోర్టు విభజనకు చివరి రోజు 2018 డిసెంబర్‌ 31న మార్గదర్శికి అనుకూలంగా తీర్పు వెలువరించారు. మార్గదర్శి కోరినట్లు సీసీ 540ని కొట్టేశారు. అందరూ హైకోర్టు విభజన హడావుడిలో ఉన్నప్పుడు వెలువడిన ఈ తీర్పును అప్పట్లో ఎవరూ గుర్తించలేదు. తీర్పు వెలువడిన కొంత కాలం తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో అప్పుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2020 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ రజనీ 2021 సెప్టెంబర్‌లో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) అమరావతి బెంచ్‌ సభ్యురాలిగా నియమితులై ప్రస్తుతం ఆ పోస్టులో కొనసాగుతున్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే ఆమెకు ఎన్‌సీఎల్‌టీ పోస్టు ఖరారైంది.

ఆర్‌బీఐ తొలిసారి వచ్చింది
ఏళ్ల తరబడి మార్గదర్శిపై తాను చేస్తున్న పోరాటంలో కీలక విషయాన్ని తెలపడానికి ఆర్‌బీఐ తొలిసారిగా కోర్టుకు వచ్చిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు. కోర్టు విచారణ అనంతరం ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి తరఫున పేరు మోసిన సీనియర్‌ న్యాయవాదులు హాజరయ్యారని తెలిపారు. ఆర్‌బీఐ చట్టం సెక్షన్‌ 45 ఎస్‌ ప్రకారం డిపాజిట్లు సేకరణ చట్ట విరుద్ధమని న్యాయవాది రమేష్‌బాబు తెలిపారన్నారు. మార్గదర్శి, రామోజీరావు వంటి వారిపై కఠిన చర్యలు ఉంటేనే చిన్న చిన్న చిట్‌ఫండ్‌ మోసాలు కూడా అరికట్టవచ్చన్నారు.

రామోజీరావు అరెస్టు కావాలనేది తన ఉద్దేశం కాదని, ఈ తరహా మోసాలు అరికట్టడమే తన అభిమతమని స్పష్టం చేశారు. తన సొంత జిల్లాలో ఇటీవలే రెండు చిట్‌ ఫండ్‌ కంపెనీల మోసాలు వెలుగు చూశాయన్నారు. ఏపీలో ఫైనాన్స్‌ పేరుతో వసూళ్లు తగ్గుముఖం పట్టాలంటే కోర్టు ఈ కేసులో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఏప్రిల్‌ 9 నాటి విచారణతో స్పష్టత వస్తుందని, చట్టవిరుద్ధంగా వసూళ్లకు పాల్పడే వారి ముక్కుకు తాడు పడుతుందని ఆశిస్తున్నానని తెలిపారు. 

Advertisement
Advertisement