ముగ్గురి ప్రాణాలు బలిగొన్న ఈత సరదా | Sakshi
Sakshi News home page

ముగ్గురి ప్రాణాలు బలిగొన్న ఈత సరదా

Published Tue, Apr 23 2024 8:35 AM

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న  సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ బలరామ్‌రెడ్డి  - Sakshi

నాదెండ్ల: ఈత సరదా ముగ్గురు మరణాలకు కారణమైంది. ఈ విషాద సంఘటన పల్నాడు జిల్లా కనపర్రు నుంచి సాతులూరు వెళ్లే మార్గమధ్యలో సోమవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. నరసరావుపేట రూరల్‌ మండలం, మొలకలూరు గ్రామానికి చెందిన ముగ్గురు స్నేహితులు గేరా పురుషోత్తం (20), బోరుగడ్డ ఆకాష్‌(20), చలమల రాజు (20) ఆదివారం ఉదయం ఎండుగుంపాలెంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ముగ్గురు ద్విచక్రవాహనంపై వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో సరదాగా ఈత కొట్టేందుకు ఉపక్రమించారు. కాలువ పక్కనే బైక్‌ను నిలిపి చెప్పులు, దుస్తులు, సెల్‌ఫోన్లు గట్టుపై పెట్టి కాలువలోకి దిగారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లవారేసరికి ముగ్గురు శవాలుగా తేలారు. సోమవారం ఉదయం అటుగా వెళ్తున్న ఎండుగుంపాలెం వాసులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలాన్ని చిలకలూరిపేట రూరల్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, నాదెండ్ల ఎస్‌ఐ జె.బలరామ్‌రెడ్డి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈతగాళ్లను పిలిపించి మృతదేహాలను వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. యువకుల మృతితో మొలకలూరు ఎస్సీ కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది.

ముగ్గురూ స్నేహితులే...

మృతులు ముగ్గురు స్నేహితులు. వేర్వేరు పనులు చేసుకుని జీవిస్తుంటారు. గేరా పురుషోత్తం ఇటీవల ఇంటర్‌ పరీక్షలు రాశాడు. తండ్రి రాజేష్‌ వ్యవసాయకూలి. బోరుగడ్డ ఆకాశ్‌ కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. తండ్రి బాజీ కూలిపనులు చేస్తుంటాడు. చలమల రాజు తెలంగాణలోని నల్గొండ చెక్‌పోస్టు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ముగ్గురు ద్విచక్రవాహనంపై ఆదివారం ఉదయం ఎండుగుంపాలెంలో జరిగే వేడుకకు వెళ్తున్నామని చెప్పి బయలుదేరారు. రాత్రి అయినా ఇంటికి చేరకపోయేసరికి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వెతుకులాట ప్రారంభించారు. కాలువలో మృతదేహాలున్నాయన్న సమాచారంతో కుటుంబ సభ్యులు తీరని విషాదంలో మునిగిపోయారు.

కనపర్రు – సాతులూరు మధ్య సాగర్‌ కాల్వ వద్ద ఘటన

చలమల రాజు 
మృతదేహం
1/3

చలమల రాజు మృతదేహం

గేరా పురుషోత్తం
మృతదేహం
2/3

గేరా పురుషోత్తం మృతదేహం

బోరుగడ్డ ఆకాష్‌ 
మృతదేహం
3/3

బోరుగడ్డ ఆకాష్‌ మృతదేహం

Advertisement
Advertisement