5జీతో విద్య, వైద్యంలో పెను మార్పులు | Sakshi
Sakshi News home page

5జీతో విద్య, వైద్యంలో పెను మార్పులు

Published Wed, Mar 1 2023 12:43 AM

Ambani scion lists 5G benefits - Sakshi

న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులతో హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయం, విపత్తు నిర్వహణ మొదలైన విభాగాల్లో భారీ మార్పులు రాగలవని టెలికం సంస్థ రిలయన్స్‌ జియో చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ తెలిపారు. వీటితో నగరాలు స్మార్ట్‌గా, సొసైటీలు సురక్షితమైనవిగా మారగలవని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌ అనంతర వెబినార్‌లో పాల్గొన్న సందర్భంగా ఆకాశ్‌ అంబానీ ఈ విషయాలు చెప్పారు.

ఆరోగ్యసంరక్షణ రంగంలో 5జీ వినియోగంతో అంబులెన్సులు డేటా, వీడియోను రియల్‌ టైమ్‌లో వైద్యులకు చేరవేయగలవని, రిమోట్‌ కన్సల్టేషన్‌లు, వేగవంతమైన రోగనిర్ధారణ విధానాలతో మారుమూల ప్రాంతాలకు కూడా నాణ్యమైన వైద్య సేవలను అందించడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయం విషయానికొస్తే వాతావరణం తీరుతెన్నులు, నేలలో తేమ స్థాయి, పంటల ఎదుగుదల మొదలైన వాటి గురించి డేటా ఎప్పటికప్పుడు పొందడం ద్వారా సరైన సాగు విధానాలు పాటించేందుకు వీలవుతుందని ఆకాశ్‌ చెప్పారు.  అంతిమంగా సమాజంపై 5జీ, అనుబంధ టెక్నాలజీలు సానుకూల ప్రభావాలు చూపగలవని వివరించారు.  

Advertisement
Advertisement