రాజకీయాల్లోకి తననెవరూ ఆహ్వానించలేదని నటి జ్యోతిక పేర్కొన్నారు. దక్షిణాదిలో ప్రముఖ కథానాయికల్లో ఒకరిగా రాణించిన ఈమె హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత నటనను దూరం పెట్టి సంసార జీవితంపై పూర్తిగా దృష్టి పెట్టారు. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు కలిగారు. పిల్లలు కాస్త పెద్ద అయిన తరువాత జ్యోతిక మళ్లీ నటనపై దృష్టి సారించారు.
శ్రీకాంత్ బయోపిక్‌లో..
ఇటీవల జ్యోతిక కథానాయికగా హిందీలో నటించిన సైతాన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆమె అంధుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్ల బయోపిక్ శ్రీకాంత్ మూవీలో టీచర్‌గా ముఖ్యపాత్రను పోషించారు. రాజ్‌కుమార్‌రావు టైటిల్ పాత్రను పోషించిన ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
అప్పుడే భర్తతో నటిస్తా
ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం చెన్నైలో జ్యోతిక మాట్లాడుతూ తనకు బాగా నచ్చిన చిత్రం శ్రీకాంత్ అని, ఇది తన కెరీర్‌లో చాలా ముఖ్యమైనదిగా నిలిచిపోతుందని తెలిపారు. దర్శకుడు ఈ చిత్రాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారన్నారు. శ్రీకాంత్ చిత్రంలో తాను భాగం కావడం ఘనతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సూర్యతో కలిసి మళ్లీ ఎప్పుడు నటిస్తారని అడుగుతున్నారని, అందుకు మంచి కథ కోసం ఎదురుచూస్తున్నట్లు జ్యోతిక చెప్పారు.
రాజకీయాల్లోకి..
మీ భర్త అగరం సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, మీరు కూడా సామాజికపరమైన సమస్యలపై స్పందిస్తున్నారని, అయితే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి జ్యోతిక స్పందిస్తూ.. నిజం చెప్పాలంటే తనని ఎవరూ రాజకీయాల్లోకి ఆహ్వానించలేదని, అయినా ప్రస్తుతం తనకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment