
చాలామంది డైరెక్టర్లు హీరోల కోసమే కథలు రాసుకుంటారు అంటోంది హీరోయిన్ జ్యోతిక (Jyotika). హీరోయిన్ల కోసం ప్రత్యేకంగా కథలు రాసుకునేవారు ఎంతమంది ఉన్నారని పెదవి విరిచింది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్. ఫిబ్రవరి 28న ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. డబ్బా కార్టెల్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా జ్యోతిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వయసైపోయినవారిని హీరోలుగా జనాలు ఒప్పుకుంటారు. కానీ హీరోయిన్ల ఏజ్ పెరిగితే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయరు.. నిజమేనా? అని అడుగుతుంటారు.
వయసు అడ్డుగోడ
ఇది చాలా పెద్ద ప్రశ్న.. నా విషయానికి వస్తే 28 ఏళ్ల వయసులో నాకు పిల్లలు పుట్టారు. ఆ తర్వాతే నేను విభిన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నాను. అయితే స్టార్ హీరోలతో కలిసి నటించలేదనుకుంటాను. ఇక్కడ వయసును పరిగణనలోకి తీసుకుంటారు. సౌత్‌లోని అన్ని ఇండస్ట్రీల గురించి నేను చెప్పలేను కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం వయసును ఒక అడ్డుగోడగా చూస్తారు. అలాంటప్పుడు మనమే కొత్త దర్శకులతో పని చేస్తూ మన కెరీర్‌ను నిర్మించుకోవాల్సి ఉంటుంది.

అదే పెద్ద సమస్య
మహిళా ప్రధాన సినిమాలు, కథలు తెరకెక్కించేందుకు కె. బాలచందర్ వంటి దర్శకులు ఇప్పుడు లేరు. ఇప్పుడున్న పెద్ద డైరెక్టర్లందరూ పెద్ద హీరోల కోసం కథలు రాసే పనిలోనే బిజీగా ఉన్నారు. మహిళా నటిని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసిన పెద్ద దర్శకుడు ఇటీవలి కాలంలో ఎవరున్నారు చెప్పండి? అదే మనం కోల్పోతున్నాం. లేడీ ఓరియంటెడ్ అనగానే బడ్జెట్ కూడా కుదించేస్తారు. వయసు పెరిగితే పరిగణనలోకి తీసుకోరు.. ఇది ఇంకో సమస్య! సౌత్‌లో నటిగా రాణించడం చాలా కష్టం. ఎప్పుడూ ఒంటరి పోరాటం చేస్తూనే ఉండాలి అని చెప్పుకొచ్చింది.
లవ్.. సినిమా
జ్యోతిక.. 'డోలీ సజా కె రఖనా' అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. వాలి చిత్రంతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. పూవెల్లమ్ కెట్టుప్పర్, ఖుషి, రిథమ్, దం దం దం, పూవెల్లం ఉన్ వాసం. ఖాకా ఖాకా, ధూల్, మన్మధన్.. ఇలా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఠాగూర్, చంద్రముఖి, మాస్ సినిమాలతో తెలుగువారికీ పరిచయమైంది. హీరో సూర్య (Suriya)తో ఏడు సినిమాల్లో నటించింది. ఆ సమయంలో సూర్యతో ప్రేమలో పడ్డ జ్యోతిక 2006లో అతడ్ని పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు దియా, కుమారుడు దేవ్ సంతానం.
చదవండి: జనరేటర్ లో పంచదార గొడవపై ప్రశ్న.. విష్ణు ఏమన్నాడంటే?
Comments
Please login to add a commentAdd a comment