
ఎవరి టాలెంట్ వారిదే! ఈ పదం సినిమా ఇండస్ట్రీలో అందరికీ వర్తిస్తుంది. ఎవరి స్క్రిప్ట్ సెలక్షన్ వారిదే.. బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా వారిదే! ఒకరితో మరొకరిని పోల్చలేం. కొన్నిసార్లు అపజయాలు ఎదురైనా మరికొన్నిసార్లు కలెక్షన్ల ఊచకోతతో రికార్డులు సృష్టిస్తుంటారు. ఫెయిల్యూర్ అందుకున్నంతమాత్రాన నటులు వెనకబడిపోయినట్లు కాదు! అయితే కంగువా సినిమాతో డిజాస్టర్ అందుకున్న హీరో సూర్య (Suriya)ను పలువురూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా జ్యోతిక (Jyotika) షేర్ చేసిన పోస్ట్ కింద నెగెటివ్ కామెంట్లతో చెలరేగిపోతున్నారు.
నీ భర్తను ఆ రేంజ్ కలెక్షన్స్ తెమ్మను
సూర్య కంటే విజయ్ బెటర్ అని ఒకరు, నీ భర్త కంటే ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఉత్తమం అని మరొకరు సెటైర్లు వేశారు. సూర్య, కార్తీల కంటే విజయ్ చాలా నయం.. ఇదే నిజం.. ఆ ఇద్దరు హీరోలను డ్రాగన్, లవ్ టుడే కంటే ఎక్కువ కలెక్షన్స్ తీసుకురమ్మనండి అంటూ ఇలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే వీటన్నింటిపై జ్యోతిక చాలా కూల్‌గా స్పందించింది. నీ భర్త కంటే విజయ్ నయం అన్న కామెంట్‌కు.. అవునా, నిజమా? అన్నట్లుగా స్మైల్ ఎమోజీతో రిప్లై ఇచ్చింది.
స్పందించడం అవసరమా?
తర్వాత సదరు కామెంట్లన్నింటినీ డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే జ్యోతిక ఆ ట్రోలర్స్‌కు రిప్లై ఇవ్వడం అవసరమా? అని పలువురు మండిపడుతున్నారు. పోనీ.. నీ భర్త కంటే వేరొకరు నయం అన్నప్పుడు చెంప చెల్లుమనిపించేలా ఆన్సర్ ఇవ్వొచ్చుగా అని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో.. ఇతర నటులు సక్సెస్ అయితే ఈ కుటుంబమంతా ఈర్ష్యతో రగిలిపోతుంది అని పెదవి విరుస్తున్నారు. ఇకపోతే జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.