
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన కంగువా సినిమా (Kanguva Movie) కలెక్షన్స్ కొల్లగొడుతుందనుకుంటే బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. దాదాపు మూడేళ్లపాటు కష్టపడి తీసిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా ఏమీ బాగోలేదని, చాలా బోరింగ్‌గా ఉందన్న విమర్శలు వచ్చాయి. దీనిపై సూర్య సతీమణి, హీరోయిన్ జ్యోతిక అప్పట్లోనే ఘాటుగా రియాక్ట్ అయింది. కంగువ అద్భుతమైన సినిమా అని.. ఇలాంటి సాహసం చేయడానికి ధైర్యం కావాలంది.
తొలి అరగంట బాగోలేదంతే
సూర్య (Suriya)ను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపింది. తొలి అరగంట సినిమా బాగోలేదు, అలాగే మ్యూజిక్ కూడా కాస్త ఎక్కువగా ఉన్నట్లు అనిపించిందని పేర్కొంది. తప్పులు జరగడం సహజమేనని, ఇలాంటి చిత్రంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయంది. ఇలాంటి మూవీకి నెగెటివ్ రివ్యూలు చూసి ఆశ్చర్యపోయానంది. డబుల్ మీనింగ్స్, ఓవర్ యాక్షన్ సీక్వెన్స్, పాత స్టోరీలతో తీసే సినిమాలకు వీళ్లెవరూ నెగెటివ్ రివ్యూలు ఇవ్వడం చూడలేదని బుగ్గలు నొక్కుకుంది.
సినిమాను తొక్కేశారు
కంగువా పాజిటివ్ అంశాలు కనబడలేదా? అని ప్రశ్నించింది. తొలిరోజే కంగువాపై నెగెటివిటీ చూస్తుంటే బాధగా ఉందని, కావాలనే సినిమాను తొక్కేస్తున్నారని మండిపడింది. తాజాగా డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో మరోసారి కంగువా సినిమా నెగెటివిటీపై స్పందించింది. జ్యోతిక (Jyotika) మాట్లాడుతూ.. కొన్ని సినిమాలు అస్సలు బాగోవు. అయినా సరే కమర్షియల్‌గా బాగా ఆడతాయి. వాటికి మంచి రివ్యూలు కూడా ఇస్తుంటారు. కానీ నా భర్త సినిమా (కంగువా) విషయానికి వచ్చేసరికి మాత్రం కాస్త కఠినంగా ప్రవర్తించారనిపిస్తుంది.
ఎన్నో దారుణ సినిమాల కంటే కంగువా నయం
సినిమాలో బాగోలేని సన్నివేశాలు కొన్ని ఉండొచ్చు. కానీ ఆ మూవీ కోసం అందరూ ఎంతగానో కష్టపడ్డారు. అది కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే.. దక్షిణాదిలో ఎన్నో అద్వాణ్నమైన సినిమాలకంటే కూడా ఈ చిత్రానికే ఎక్కువ దారుణమైన రివ్యూలు ఇచ్చారు. అది చూసి నాకెంతో బాధేసింది అని చెప్పుకొచ్చింది. సుమారు రూ.350 కోట్లతో తెరకెక్కిన కంగువా కేవలం రూ.160 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment