Sakshi News home page

ప్రముఖ ప్రాజెక్ట్‌ను నిలిపేయనున్న యాపిల్‌.. ఉద్యోగులకు లేఆఫ్స్‌

Published Mon, Mar 25 2024 1:34 PM

Apple To Cut Jobs After Shutting Down Smartwatch Display Unit - Sakshi

ప్రపంచ నంబర్‌1 కంపెనీ యాపిల్ తయారుచేస్తున్న ఐఫోన్లు, వాచ్‌లకు ఉన్న క్రేజ్‌ తెలిసిందే. అలాంటి విలువైన కంపెనీలో ఉద్యోగం అంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. కానీ, యాపిల్ తన ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తోందని వార్తలొస్తున్నాయి. యాపిల్‌ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మూసేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది.

మీడియా కథనాల ప్రకారం.. యాపిల్‌ స్మార్ట్ వాచ్ డిస్‌ప్లే డిజైనింగ్ అండ్ డెవలపింగ్ ప్రాజెక్టును మూసేయనుంది. దాంతో కంపెనీ ఆ ప్రాజెక్టులో పని చేస్తున్న ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇవ్వబోతుంది. కొంత కాలం క్రితమే మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన స్క్రీన్ల తయారీని కంపెనీ నిలిపేసింది. 

మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన స్క్రీన్లు, విజువల్స్ ఎంతో మెరుగ్గా ఉండటంతో అందరూ ‘యాపిల్ వాచ్’ కొనుగోలు చేస్తున్నారు. అయితే, డిస్ ప్లే తయారీ ఖర్చు ఎక్కువ కావడంతో యాపిల్ తన డిస్ ప్లే ఇంజినీరింగ్ టీంలో మార్పులు చేయనుందని సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా, ఆసియా ఖండాల్లోని ఆపిల్ యూనిట్లలో డజన్ల కొద్దీ ఉద్యోగులను తొలగించనుంది. అయితే సరిగ్గా ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నారనే దానిపై కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 

డిస్‌ప్లే డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును మూసేయడానికి ముందే ఉద్యోగులను ఇతర ప్రాజెక్టులు, కంపెనీల్లో తమకు వీలైన కొలువు వెతుక్కునేందుకు సంస్థ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. కానీ అందరికీ ఆ అవకాశం ఉండదు కాబట్టి మిగతా వారిని ఇంటికి సాగనంపేందుకు కంపెనీ సిద్ధమైనట్లు మీడియా కథనాల సారాంశం. 

‘టైటన్‌’ను పక్కన పెట్టిన యాపిల్‌

యాపిల్ తన ప్రతిష్టాత్మకమైన కారు ప్రాజెక్టును ఎట్టకేలకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని ఇటీవలే కథనాలు వెలువడ్డాయి. అటానమస్‌ డ్రైవింగ్ సామర్థ్యం కలిగిన కారు విడుదల ప్రణాళికలను యాపిల్‌ పక్కన పెట్టింది. ఈ మేరకు గత దశాబ్దకాలంగా ‘టైటన్‌’ పేరిట పనిచేస్తున్న రహస్య ప్రాజెక్టుకు స్వస్తి పలికినట్లైంది.

ఇదీ చదవండి: భారత్‌లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు

గతేడాది భారీగా లేఆఫ్స్ లు ప్రకటించిన టెక్ కంపెనీలు..2024లో కూడా అదే పరంపర కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 50 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. కంపెనీ పునర్వవస్థీకరణ, ఖర్చుల తగ్గింపు, అప్‌డేటెడ్‌ టెక్నాలజీ వినియోగం, కొత్త వ్యాపారంలోకి ప్రవేశించడం వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్, హెల్త్ రంగంలోని కంపెనీలు ఉద్యోగులపై వేటువేస్తున్నాయి.

Advertisement
Advertisement