కోట్ల రూపాయలు కావాలా..? స్థలం ఎక్కడ కొనాలంటే.. | Sakshi
Sakshi News home page

కోట్ల రూపాయలు కావాలా..? స్థలం ఎక్కడ కొనాలంటే..

Published Sat, Jan 13 2024 8:41 PM

Developing Realestate Places In Hyderabad - Sakshi

రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన వారు మంచి రాబడులు అందుకుంటున్నారు. దశాబ్దకాలంలో సగటున ఏటా 10 శాతం చొప్పున ఇంటి విలువలు పెరిగాయి. 2013లో రూ.50 లక్షలు విలువ చేసే ఇల్లు కొంటే దాని ధర ఇప్పుడు రూ.కోటిపైనే పలుకుతోంది. బాగా వృద్ధి ఉన్న ప్రాంతాల్లో ఇంతకు రెండుమూడు రెట్లు పెరిగిన సందర్భాలున్నాయి. వచ్చే దశాబ్దంలోనూ రియల్‌ ఎస్టేట్‌లో వృద్ధి కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మార్కెట్‌ కొన్నాళ్ల పాటు స్తబ్ధుగా ఉండటం, ఆ తర్వాత ఒక్కసారిగా పెరగడం హైదరాబాద్‌లో పలుమార్లు జరిగింది. పెద్ద నోట్ల రద్దు, కొవిడ్‌ అనంతరం ఎక్కువ మంది ఇలాంటి పరిస్థితిని గమనించే ఉంటారు. దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టిన వారు లాభపడ్డారు. మంచి రాబడులు అందుకున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ముగిసి, లోక్‌సభ ఎన్నికలు రాబోతుండడంతో మార్కెట్లో కొంత స్తబ్ధత కన్పిస్తోంది. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మార్కెట్‌ మళ్లీ పెరగడం ఖాయమని నిర్మాణదారులు అంటున్నారు. కాబట్టి ఇంటి కల నెరవేర్చుకునేవారు, పెట్టుబడి కోణంలో రెండో ఇల్లు కొనేవారికి ఇప్పుడు అనుకూల సమయం అంటున్నారు. అయితే ఎలాంటి ప్రదేశంలో ఇల్లు, స్థలం కొనాలో నిపుణులు కొన్ని అంశాలను సూచిస్తున్నారు.

  • ఉద్యోగ, ఉపాధి సంస్థలు పెద్ద ఎత్తున వస్తున్న ప్రాంతాలకు చేరువగా ఉన్న ప్రాంతాలను పరిశీలించవచ్చు.
  • ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. వంద అడుగుల రహదారులను చేపట్టగానే ఆ ప్రాంతంలో స్థిరాస్తుల ధరలు ఒక్కసారిగా పెరగడం గమనించే ఉంటారు.
  • మూసీపై వంతెనలతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయిన ఉదాహరణలు కళ్లముందే ఉన్నాయి. కొత్తగా కొన్నిచోట్ల ప్రభుత్వం మూసీపై వంతెనలను కట్టబోతుంది. వీటిలో ఇప్పటివరకు లేని చోట ఎక్కడ కడుతున్నారో దృష్టి పెట్టాలి.
  • మెట్రోరైలును సిటీలో పలు ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. ఎక్కడ తొలుత విస్తరిస్తున్నారో గమనించాలి. ఇలాంటి చోట్ల తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుదల ఉంటుంది.

ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ..

  • ఇవేవి లేకున్నా కూడా సహజంగా వృద్ధి చెందే ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ నిలకడగా ధరల వృద్ధి, అభివృద్ధి ఉంటుంది. మీరు శివార్లలో ఉంటున్నట్లయితే అక్కడి నుంచి పది కి.మీ. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై ఒక నజర్‌ వేయండి.
  •  స్థిరాస్తి సంస్థల ప్రకటనలు గమనించండి.. స్థలాలు, ఫ్లాట్లు, విల్లాల ప్రాజెక్టులు ఎటువైపు వస్తున్నాయో అవగాహన పెంచుకోండి. ప్రత్యక్షంగా చూసిన తర్వాత నిర్ణయానికి రండి.

Advertisement
Advertisement