జాగ్రత్త పడండి.. ఆర్బీఐ వార్నింగ్‌! | Sakshi
Sakshi News home page

జాగ్రత్త పడండి.. ఆర్బీఐ వార్నింగ్‌!

Published Fri, Feb 2 2024 9:41 PM

Dont Share Documents With Unknown Entities For KYC Updating Warns RBI - Sakshi

కేవైసీ అప్‌డేట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజలను హెచ్చరించింది. కేవైసీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని సంస్థలతో పత్రాలను పంచుకోవద్దని  సూచించింది.

కేవైసీ అప్‌డేట్‌ల పేరుతో తరచుగా మోసాలు జరుగుతన్న నేపథ్యంలో వాటిని నివారించడానికి జాగ్రత్తలు పాటించాలని కోరుతూ ఆర్బీఐ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి మోసాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ గతంలో కూడా ప్రజలను హెచ్చరించింది.

కేవైసీ పత్రాలు లేదా వాటి కాపీలను తెలియని, గుర్తింపులేని వ్యక్తులు లేదా సంస్థలతో పంచుకోవద్దని పేర్కొంది. అలాగే అకౌంట్‌ లాగిన్ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌, కార్డ్ సమాచారం, పిన్, పాస్‌వర్డ్, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది.

సాధారణంగా ఇటువంటి మోసాలు ఫోన్ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌, ఈమెయిల్స్‌ వంటి వాటి ద్వారా జరుగుతున్నాయని ఆర్బీఐ పేర్కొంది. ఇలా వచ్చిన వాటికి స్పందించి వ్యక్తిగత సమాచారం, అకౌంట్‌ లాగిన్ వివరాలను బహిర్గతం చేయడం, సందేశాలలో అందించిన లింక్‌ల ద్వారా అనధికారిక లేదా ధ్రువీకరించని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం వంటివి చేస్తూ కస్టమర్లు మోసపోతున్నారని వివరించింది.

కేవైసీ అప్‌డేట్ కోసం అభ్యర్థన వచ్చినప్పుడు నిర్ధారణ కోసం నేరుగా మీ బ్యాంక్, సంబంధిత ఆర్థిక సంస్థను సంప్రదించాలని ఆర్బీఐ సూచించింది. బ్యాంక్, ఫైనాన్స్‌ సంస్థల కాంటాక్ట్‌ నంబర్, కస్టమర్ కేర్ ఫోన్ నంబర్‌ను దాని అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే పొందాలని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఏదైనా సైబర్ మోసం జరిగినప్పుడు కస్టమర్‌లు వెంటనే బ్యాంక్, ఫైనాన్స్‌ సంస్థకు తెలియజేయాలని సూచించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement