కొన్నాళ్ల గ్యాప్ తర్వాత నవదీప్ హీరోగా చేసిన సినిమా 'లవ్ మౌళి'. అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. తాజాగా జూన్ 7న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీతో నవదీప్ 2.0 మొదలైందని ప్రమోషన్స్ చేశారు. ఇందుకు తగ్గట్లే టీజర్, ట్రైలర్ కాస్త అంచనాలు పెంచాయి. ట్రైలర్‌లో ముద్దు, బోల్డ్ సీన్స్ వైరల్ అయ్యాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథేంటి?
మౌళి (నవదీప్) తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో తాతయ్య దగ్గర పెరుగుతాడు. 14 ఏళ్ల వయసులో ఆయన చనిపోవడంతో తనకు ఇష్టమొచ్చినట్లు, ప్రపంచాన్ని పట్టించుకోకుండా పెరుగుతాడు. తన లోకంలో తానుంటాడు. స్వతహాగా పెయింటర్ అయిన మౌళి.. మేఘాలయాలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా అడవుల్లో అఘోరాతో ప్రేమ విషయమై గొడవ పడగా, ఓ పెయింట్ బ్రష్‌ని సృష్టించి ఇస్తాడు. కొన్నాళ్ల తర్వాత దానితో ఓ అమ్మాయి బొమ్మ గీయగా, అందులో నుంచి నిజంగానే చిత్ర(పంఖురి గిద్వాని) అనే అమ్మాయి బయటకొస్తుంది. ఈమెతో గొడవ అయ్యేసరికి చిత్ర బొమ్మ మరోసారి గీస్తాడు. డిఫరెంట్ పర్సనాలిటీతో మళ్లీ వస్తుంది. ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది? అసలు మౌళి ప్రేమ గురించి తెలుసుకున్నాడా? చివరకు ఏమైందనేదే స్టోరీ?
ఎలా ఉందంటే?
'లవ్ మౌళి' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సాధారణ ప్రేమకథ. కాకపోతే ఓ ఫాంటసీ ఎలిమెంట్ జోడీంచడం వల్ల స్క్రీన్ ప్లే కాస్త కొత్తగా అనిపించింది. ప్రేమ అంటే ఏంటని వెతికే క్రమంలో ఓ అబ్బాయి ఏం తెలుసుకున్నాడు అనే పాయింట్‌తో ఈ మూవీ తీశారు. అయితే తొలి సగం కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ మూవీ స్టోరీకి తగ్గట్లు లోకేషన్స్, మ్యూజిక్ అదిరిపోయింది. కథంతా మేఘాలయలోనే ఉంటుంది.
సీన్స్ పరంగా చూసుకుంటే ప్రేమ, పెళ్లిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఓ చోట కనెక్ట్ అవుతాయి. ఈ సినిమాలోని ప్రేమ ఎమోషన్‍కి మనం కనెక్ట్ అయితే సినిమా బాగా నచ్చేస్తుంది. ముద్దు సీన్స్, బోల్డ్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. చాలా వరకు ముద్దు సీన్స్ సహజంగానే అనిపించినా ఒకటి రెండు బోల్డ్ సీన్స్ మాత్రం అవసరమా అనిపిస్తాయి. కథని ఎంత కొత్తగా చూపించినా చివరకు అందరూ చెప్పేదే చెప్పడంతో ఓస్ ఇంతేనా అనిపిస్తుంది.
ఎవరెలా చేశారు?
ప్రమోషన్స్‌లో 2.0 అనేలా నవదీప్ యాక్ట్ చేశాడు. బాడీ, సీన్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. హీరోయిన్ చిత్ర పాత్ర చేసిన పంఖురి గిద్వాని సూపర్‌గా చేసింది. హారికగా నటించిన భావన సాగి పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రలు ఓకే. రానా దగ్గుబాటి అఘోరాగా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి అదరగొట్టేసాడు. టెక్నికల్ విషయాలకొస్తే.. లొకేషన్స్ అదిరిపోయాయి. మేఘాలయని అద్భుతంగా చూపించారు. దర్శకుడే సినిమాటోగ్రాఫర్ కావడంతో ఔట్‌పుట్ అదిరిపోయింది. గోవింద్ వసంత, కృష్ణ ఇచ్చిన సంగీతం సరిగ్గా సరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంటుంది. అవనీంద్ర, దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువల మూవీకి తగ్గట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment