నొప్పి తెలియకుండా .. ఏఐ సాయంతో టాటూ ప్రింటర్‌ లాంచ్‌ చేసిన ఎల్‌జీ | Sakshi
Sakshi News home page

నొప్పి తెలియకుండా .. ఏఐ సాయంతో టాటూ ప్రింటర్‌ లాంచ్‌ చేసిన ఎల్‌జీ

Published Sun, Jan 21 2024 11:12 AM

Review On Lg New Portable Tattoo Machine - Sakshi

పచ్చబొట్లకు ఫ్యాషన్‌ ప్రపంచంలో విపరీతమైన గిరాకీ ఉంది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా టాటూ స్టూడియోలు కళకళలాడుతుంటాయి. అయితే, టాటూ వేయించుకోవాలంటే ఖర్చును, నొప్పిని కూడా భరించాల్సి ఉంటుంది. కోరుకున్న డిజైన్లలో పచ్చబొట్టు వేయడానికి చాలా సమయం కూడా పడుతుంది. కోరుకున్న డిజైన్లలోని పచ్చబొట్లను చిటికెలో ముద్రించే ఈ టాటూ ప్రింటర్‌ను కొరియన్‌ బహుళజాతి సంస్థ ఎల్‌జీ ఇటీవల రూపొందించింది.

చేతిలో ఇమిడిపోయే పరిమాణంలో ఉన్న ఈ టాటూ ప్రింటర్‌ శరీరంపైనే కాకుండా, దుస్తులపై కూడా కోరుకున్న డిజైన్లను క్షణాల్లోనే ముద్రిస్తుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ టాటూ ప్రింటర్‌ను మొబైల్‌ ఫోన్‌ యాప్‌ ద్వారా ఉపయోగించుకునే వెసులుబాటు కూడా ఉంది. యాప్‌ ద్వారా డిజైన్లను ఎంపిక చేసుకుని, టాటూను ముద్రించదలచుకున్న చోట దీన్ని ఉంచి, ఆన్‌ చేసుకోవడమే తరువాయిగా రకరకాల రంగుల్లో, రకరకాల డిజైన్లలో టాటూలను ముద్రించుకోవచ్చు.

‘ఎల్‌జీ హెచ్‌ అండ్‌ హెచ్‌ ఇంప్రింటు’ పేరుతో రూపొందించిన ఈ టాటూ ప్రింటర్‌ను ఎల్‌జీ కంపెనీ ఈ ఏడాది లాస్‌ వేగస్‌లో జరగనున్న సీఈఎస్‌–2024 షోలో ప్రదర్శించనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. 

Advertisement
 
Advertisement