‘డెడ్‌మ్యాన్‌’ రిటైర్డ్‌ | LEGEND WRESTLER UNDERTAKER ANNOUNCES RETIREMENT | Sakshi
Sakshi News home page

రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పిన అండర్‌ టేకర్‌

Published Tue, Nov 24 2020 6:41 PM | Last Updated on Wed, Nov 25 2020 2:20 PM

LEGEND WRESTLER UNDERTAKER ANNOUNCES RETIREMENT - Sakshi

మార్క్‌ విలియమ్‌ కాలవే.. అంటే ఎవరో తెలియకపోవచ్చు. కానీ అండర్‌ టేకర్‌ అంటే తెలియని వాళ్లు అరుదు. కొందరు ముద్దుగా డెడ్‌ మ్యాన్‌ అని కూడా పిలుచుకుంటారు. ముఖ్యంగా ‘90ల్లో పుట్టిన తరానికి, అందునా రెజ్లింగ్‌ ఇష్టంగా చూసేవారికి ఇది చాలా సుపరిచితమైన పేరు. అతనికి అతీత శక్తులుంటాయని, ఏడు జన్మలున్నాయని పిల్లల సర్కిల్లో రకరకాల పుకార్లు షికార్లు చేస్తుంటాయి. కెరీర్‌లో బరిలోకి దిగిన మ్యాచుల్లో 70 శాతం విజయాలతో వల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (డబ్ల్యుడబ్ల్యుఈ) లోనే ఎవరికీ అందనంత ఎత్తులో అగ్రస్థానంలో ఉన్నాడు. చీకట్లో చర్చి గంట శబ్దంతో, నీలి మెరుపులతో, నిప్పురవ్వలతో రింగులోకి వచ్చే తీరుతోనే ప్రత్యర్థిని బెదరగొట్టి అక్కడే సగం గెలిచేస్తాడు టేకర్‌. బలమైన ప్రత్యర్థి చేతిలో చావుదెబ్బలు తిని పడిపోతే ఇక అతని పని ముగిసినట్టే అని అందరూ అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా లేచి నిలబడతాడు. రెట్టించిన శక్తితో ప్రత్యర్థిపై విరుచుకుపడి మ్యాచ్‌ గెలుస్తాడు.

మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అనంతరం రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పేశాడు ఈ లెజెండ్‌. ఆదివారం సర్వైవర్‌ సిరీస్‌లో తాను రిటైర్‌ అవుతున్నట్టు ప్రకటించాడు. ఫేర్వెల్‌‌ సందర్భంగా డబ్ల్యుడబ్ల్యుఈ సీయీవో విన్సెంట్‌ మెక్‌మహోన్‌ రింగు మధ్యలోకి వచ్చి అండర్‌ టేకర్‌ రాకను ప్రకటించాడు. ఆ సమయంలో భావోద్వేగానికి గురైన మెక్‌మహోన్‌ ‘‘30 ఏళ్లుగా అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్న ఒక కెరీర్‌ ముగిసిపోబోతుంది. ఏదీ శాశ్వతం కాదంటారు చాలామంది. కానీ నా వరకూ అది అబద్ధం. రెజ్లింగ్‌పై టేకర్‌ వేసిన ముద్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచుంటుంది. ఈ ఆట ముఖచిత్రాన్నే మార్చివేసిన పోరాట యోధుడు అండర్‌ టేకర్‌’’ అన్నారు. ఆ వెంటనే తనకు మాత్రమే ప్రత్యేకమైన స్టైల్లో రింగులోకి ఎంటరైన టేకర్‌ అభిమానుల కేరింతల మధ్య మైకందుకుని ‘‘అండర్‌ టేకర్‌కు విశ్రాంతినివ్వాల్సిన సమయమొచ్చింది’’ అన్నాడు. తన మాజీ మేనేజర్‌ బిల్‌ మూడీ హాలోగ్రామ్‌ ప్రదర్శించి మూడీపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అండర్‌ టేకర్‌ ఇమేజ్‌ను నిర్మించడంలో మూడీది కీలకపాత్ర.

‘‘అది ఇంకెక్కడా దొరకదు’’
‘‘మనం ఏదైనా సాధించినప్పుడు కేరింతలు, ఒవేషన్‌ రూపంలో ప్రేక్షకుల నుంచి తిరిగొచ్చే శక్తి ఇంకెక్కడా దొరకదు. బహుశా ఇందుకే కొందరు (‘ది రాక్‌’ లాంటివారు) రిటైరైన తర్వాత కూడా రీ ఎంట్రీ ఇస్తుంటారు. నా వరకు రెజ్లింగ్‌ అనేది అత్యుత్తమ క్రీడ. ప్రేక్షకులు ప్రత్యక్షంగా సినిమా చూస్తున్న అనుభూతికి లోనవుతారిక్కడ. ఆటగాళ్లలో ఉండే ఎమోషన్‌ కూడా చాలా ఎక్కువే. అదే సమయంలో కొన్ని హద్దులు దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. ఎంతో ఒత్తిడితో కూడుకున్న ఈ ఆటలో మా ప్రతిభకు తగినంత గుర్తింపు లభిస్తుందా? అని అప్పుడప్పుడూ ఆలోచిస్తుంటాను. నిజంగా ఈ 30 ఏళ్లు చాలా వేగంగా గడిచిపోయాయి.’’
 - అండర్‌ టేకర్‌ (డబ్ల్యుడబ్ల్యుఈ రూపొందించిన డాక్యుమెంటరీలో..)

ప్రకటన‌ అనంతరం సోషల్‌ మీడియాలో స్పందించిన సహచర రెజ్లర్లు..

‘‘తన జీవితంలో 30 ఏళ్లు డబ్ల్యుడబ్ల్యుఈ కి అంకితం చేసిన ఓ అత్యుత్తమ ఆటగాడికి వీడ్కోలు చెప్పాల్సిన సమయమొచ్చింది. తోటి ఆటగాడిగా రింగులో నాతో కొన్ని క్షణాలు పంచుకున్నందుకు థాంక్యూ టేకర్‌!’’
- జాన్‌ సీనా

‘‘30 ఏళ్ల క్రితం ఈ రోజున​ మా అందరిలాగే అరంగేట్రం చేశాడతను. నా కెరీర్‌ ప్రారంభంలో ఓ సాయంత్రం డ్రెసింగ్‌ రూములోకొచ్చి నన్ను ప్రోత్సహించేలా మాట్లాడిన మాటలు నేనెప్పటికీ మర్చిపోలేను. నీతో కలిసి రింగ్‌ పంచుకోవడం ఒక గౌరవం.’’
- ది రాక్‌

‘‘మనిద్దరం ప్రతీ ఫార్మట్‌లో తలపడ్డాం. కొన్ని ప్రత్యేకానుభూతుల్ని సృష్టించుకున్నాం. రింగులో ఉన్నప్పుడు నువ్వొచ్చేముందు వినిపించే ఆ బెల్‌ శబ్దం నన్ను భయపెట్టేది. అయినా చివరిసారిగా దాన్ని వినేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా.’’
- షాన్‌ మైఖేల్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement