ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు చిత్తు (PC: IPL/RCB)
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. మళ్లీ పాత కథే.. ఐపీఎల్-2024లో వరుసగా ఆరు పరాజయాలు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి అవుటైనట్లే ఇక అనుకున్న సమయంలో అనూహ్య రీతిలో కమ్‌బ్యాక్.
వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి టాప్-4లో అడుగు.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత. ఈ గండం దాటితే క్వాలిఫయర్-2 ఆడొచ్చు. అక్కడా గెలిస్తే ఏకంగా ఫైనల్లో.. ఇక టైటిల్‌కు ఒకే ఒక్క అడుగు దూరం..
ఆర్సీబీ జోరు చూస్తే ఈసారి కప్పు మనదే అనిపిస్తోందంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం.. రాజస్తాన్ రాయల్స్‌ను ఆర్సీబీ ఎలిమినేట్ చేయడం ఖాయమంటూ జోస్యాలు చెప్పారు.
అందరి అంచనాలు తలకిందులు చేస్తూ
అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రాజస్తాన్ అద్భుత ఆట తీరుతో ఆర్సీబీ ఆశలను గల్లంతు చేసింది. వరుసగా ఓటముల తర్వాత.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.
ఫలితంగా ఆర్సీబీ పదిహేడేళ్ల కల ఈసారికీ కలగానే మిగిలిపోయింది. అయితే, సీజన్ ఆసాంతం ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడం ఒక్కటే అభిమానులకు కాస్త ఊరట కలిగిస్తోంది.
దుమ్ములేపిన కోహ్లి.. కానీ ఏం లాభం?
ఈ ఎడిషన్‌లో కోహ్లి 15 ఇన్నింగ్స్‌లో కలిపి 741 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి ఇప్పటికైనా ఆర్సీబీని వదిలేయాలని విజ్ఞప్తి చేశాడు.
‘‘ఇంతకు ముందు చెప్పాను.. ఇప్పుడూ అదే చెప్తున్నా. ఇతర క్రీడల్లోని దిగ్గజాలు సైతం ఒకానొక సమయంలో తమ సొంత జట్లను వదిలి వేరే చోటకు వెళ్లి టైటిల్స్ సాధించారు.
ఆర్సీబీని వీడటమే ఉత్తమం
ఇప్పటికే కోహ్లి ఎంతగానో ప్రయత్నించాడు. మరోసారి ఆరెంజ్‌క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. ఫ్రాంఛైజీ కోసం ఎంతో చేస్తున్నాడు. కానీ ఈసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవడంలో విఫలమైంది.
బ్రాండ్‌వాల్యూ పరంగా ఫ్రాంఛైజీతో కోహ్లి బంధం ఎలాంటిదో తెలుసు. అయినప్పటికీ.. ట్రోఫీ ముద్దాడేందుకు కోహ్లి నూటికి నూరుపాళ్లు అర్హుడు. కాబట్టి టైటిల్ గెలిచే సత్తా ఉన్న టీమ్‌లోకి అతడు వెళ్లాలని కోరుకుంటున్నా’’ అని ఆర్సీబీ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు.
ఢిల్లీకి ఆడాలి
వచ్చే ఏడాది కోహ్లి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారిపోవాలని సూచించాడు. సొంతగడ్డకు చెందిన ఫ్రాంఛైజీకి అతడు ప్రాతినిథ్యం వహిస్తే చూడాలని ఉందని.. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ దిగ్గజాలు బెక్‌హాం, క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ తదితరులు ఫ్రాంఛైజీలు మారి విషయాన్ని పీటర్సన్ ప్రస్తావించాడు. కాగా ఐపీఎల్ ఆరంభం నుంచి అంటే 2008 నుంచి కోహ్లి ఆర్సీబీతోనే ఉన్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 8 వేలకు పైగా పరుగులు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించాడు.
చదవండి: Hardik Pandya: భార్యతో హార్దిక్ పాండ్యాకు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment