
‘బుజ్జి’.. ఈ పేరు గత నాలుగైదు రోజులుగా టాలీవుడ్‌లో హల్ చల్ చేసింది. నా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారంటూ ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ ‘బుజ్జి’పై ఆసక్తిని కనబరిచారు. దానికి తగ్గట్టే నిన్న(మే 22) మేకర్స్ హైదరాబాద్‌లో ఓ బిగ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేసి బుజ్జిని పరిచయం చేశారు. ప్రభాస్ ఓ భారీ స్టంట్ చేస్తూ బుజ్జి తో మాస్ ఎంట్రీ ఇచ్చాడు. డార్లింగ్ ఎంట్రీ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అయితే ఈ స్టంట్ పర్ఫెక్ట్‌గా రావడం కోసం ప్రభాస్ మూడు రోజుల పాటు రోజుకు నాలుగైదు గంటలు ప్రాక్టీస్ చేశారట. అందుకే ఆ కారు(బుజ్జి)ని పర్ఫెక్ట్‌గా గ్రౌండ్‌లోకి తీసుకురావడమే కాకుండా.. దాంతో చక్కర్లు కొట్టి ఆకట్టుకున్నాడు.
అయితే బుజ్జి పరిచయం కేవలం 56 సెకన్ల వరకే ఉండడంతో ప్రభాస్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశకు లోనయ్యారు. బుజ్జి వీడియో చూశాక పక్కనే ఉన్న దర్శకుడు నాగ్ అశ్విన్ చూసి ‘ఏంటి సార్.. మూడేళ్లలో తీసి 50 సెకన్లు చూపిస్తారా?..మిమ్మల్లి కొట్టాలి ఇక్కడకు రండి’అంటూ నాగికి ప్రభాస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు. ఫైనల్లీ బుజ్జీని పరిచయం చేశాం. నేనేదో మన డార్లింగ్స్‌కి హాయ్ చెప్పి వెళ్లి పోదాం అనుకుంటే .. నాతో ఫీట్లు చేయించాడు. క్యూరియాసిటీని పెంచేందుకే నాగి నాతో ‘స్పెషల్ పర్సన్’ అని ట్వీట్ వేయించాడు. బుజ్జి నాకు చాలా ప్రత్యేకం. బుజ్జి మెదడు కంటే బాడీ నాకు ఇష్టం’ అని ప్రభాస్ అన్నారు.