సాక్షి, హైదరాబాద్: ఫార్ములా వన్ అంటే సగటు ఫార్ములా వన్ అభిమానికి టపీమని గుర్తొచ్చే పేరు ఫెరారీ.. ఇప్పటి వరకూ ఫార్ములా వన్‌లో 235 రేసులకు పైగా విజయాలతో మిగతా టీంలకు అందనంత ఎత్తున నిలిచిన ఈ ఇటాలియన్ టీం ప్రస్తుతం విజయాల కోసం ఎదురు చూస్తోంది. చివరి సారిగా 2007లో కిమిరైకోనెన్‌ను ప్రపంచ డ్రైవర్ చాంపియన్‌ను చేసిన ఫెరారీ తిరిగి మళ్లీ ఆ ఘనతను సాధించలేకపోయింది. ప్రస్తుతం జరుగుతున్న హైబ్రీడ్ ఎరాలో మెర్సిడెస్ ముందర మోకరిల్లింది. 90 ఏళ్ల రేసింగ్ చరిత్ర కలిగిన ఫెరారీ నేడు దారుణంగా విఫలమవుతుండడం సగటు ఫెరారీ అభిమానికే కాకుండా ఫార్ములా వన్‌తో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తిని బాధించే అంశం
2019 ఫార్ములా వన్ సీజన్ మొదలై ఇప్పటికే దాదాపు రెండు నెలలు కావొస్తుంది. 5 రేసులు ముగిసే సరికి మాజీ ప్రపంచ రేసింగ్ చాంపియన్ అయిన ఫెరారీ ఒక్క రేసు కూడా గెలవకపోవడాన్ని ఫెరారీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరిగిన ప్రీ సీజన్ టెస్టింగ్‌లో దూకుడును ప్రదర్శించిన ఫెరారీ సీజన్ ఆరంభం తరువాత మెర్సిడెస్ పేస్‌కు తలవంచింది. 2019 సీజన్ మొదటి గ్రాండ్ ప్రీ అయిన ఆస్ట్ర్రేలియాలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన ఫెరారీ అంచనాలను అందుకోలేక 4, 5 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. తదుపరి జరిగిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ రేసులో క్వాలిఫయింగ్‌లో పోల్ సాధించడంతో పాటు ఫ్రంట్ రోని లాక్ చేసిన ఫెరారీ గాడిలో పడిందని అందరూ అనుకున్నారు. అయితే రేసు రోజున ఇంజన్‌లో తలెత్తిన సాంకేతిక లోపంతో గెలవాల్సిన రేసును ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్‌లెరిక్ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అదే రేసులో రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన మరో ఫెరారీ డ్రైవర్, మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ చేసిన చిన్న పొరపాటు వలన 5వ స్థానంతో ముగించాడు. అదే విధంగా మూడో రేసైన చైనా గ్రాండ్ ప్రీలో మెర్సిడెస్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది.
పని చేయని అప్‌గ్రేడ్స్
చైనా రేసులో అంచనాలను అందుకోలేక పోయిన ఫెరారీ తదుపరి రేసు అయిన అజర్‌బైజాన్ గ్రాండ్ ప్రీ కోసం ఫ్రంట్ వింగ్ అప్‌గ్రేడ్స్‌తో ముందుకొచ్చింది. అయినా ఫెరారీ దురదృష్టంలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో స్పానిష్ గ్రాండ్ ప్రీ కోసం ఇంజన్ అప్‌గ్రేడ్ చేసినా ఫెరారీ అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది.
డిజైన్ కాన్సెప్ట్‌లో తప్పుంది
2019 సీజన్ కారు అయినటువంటి ఎస్‌ఎఫ్-90ఎచ్ కారు డిజైన్ కాన్సెప్ట్‌లో తప్పుందని టీం ప్రిన్సిపల్ మాటియా బినొట్టో స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసు అనంతరం వ్యాఖ్యానించారు. కార్నర్స్‌లో మెర్సిడెస్, రెడ్‌బుల్ కార్ల కంటే వేగంగా వెళ్లలేకపోతున్నామని, అయితే స్ట్నేయిట్ లైన్ స్పీడులో మా ఇంజిన్ అద్భుతంగా పని చేస్తోందని ఆయన అన్నారు. అయితే 2016 సీజన్ మాదిరే ఈ సీజన్ కూడా ఫెరారీ ఒక్క విజయం నమోదు చేయకుండానే ముగిస్తుందేమోననే ఆందోళనలో ఫెరారీ అభిమానులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment